నమ్మించి బలిపశువులను చేస్తారా - వైఎస్ ఫ్యామిలీపై వైసీపీ నేతల ఫైర్..!!
వైసీపీ నేతలు ఓటమి వెనుక కారణాలను జీర్ణించుకోలేక పోతున్నారు. ఓటమి పైన తమ మనసులోని అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. జగన్ పైన విశ్వాసం వ్యక్తం చేస్తూనే జరిగిన పరిణామాల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ మరణం తరువాత తమను వైసీపీలోకి రావాలని ఆహ్వానించిన వారే తమను బలిపశువులను చేయటం ఏంటని మండిపడుతున్నారు. ఆస్తి తగాదాలు ఉంటే కోర్టులో చూసుకోవాలని.. తమను పతనం చేయటం ఏంటని వైఎస్ కుటుంబాన్ని నిలదీస్తున్నారు.
ఆహ్వానించి ఇలా చేస్తారా
వైసీపీ ఓటమిలో వైఎస్ కుటుంబ సభ్యులే భాగస్వాములు కావటం పార్టీ నేతలకు రుచించటం లేదు. జగన్ లక్ష్యంగా షర్మిల చేస్తున్న రాజకీయం పార్టీకి నష్టం చేసిందనే ఆగ్రహం వారిలో కనిసిస్తోంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక ఇంట్వర్యూలో షర్మిల తీరు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా పేర్ని నాని సైతం కేతిరెడ్డి వ్యాఖ్యలను సమర్ధించారు. వైఎస్ అభిమానులను తమ పార్టీలోకి రావాలని నాడు జగన్, విజయమ్మ కోరారని..అందరికీ అండగా ఉంటామని చెప్పిన విషయాన్ని పేర్ని నాని గుర్తు చేసారు.

కోర్టుల్లో చూసుకోండి
జగన్ పైన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన సమయంలో షర్మిల, విజయమ్మ తన లాంటి వారికి భరోసా ఇచ్చి పార్టీలోకి తెచ్చారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కుటుంబాన్ని నమ్ముకొని లక్షలాది మంది పార్టీలోకి వచ్చారని పేర్ని నాని పేర్కొన్నారు. ఆస్తుల తగాదాలు ఉంటే కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. నమ్ముకున్న వారిని బలి పశువులను చేస్తారా అని ప్రశ్నించారు. ఇది ధర్మం, నీతి కాదని వ్యాఖ్యానించారు. మీ కుటుంబ వ్యవహారాల కోసం ఇంత మందిని పతనం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల వేల విజయమ్మ విడుదల చేసిన వీడియో ను తప్పుబట్టారు.

జగన్ సరిదిద్దుకుంటారు
కార్యకర్తలే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా నష్టపోయారని..జగన్ సరి దిద్దుకుంటారని పేర్ని నాని చెప్పారు. జగన్ రోడ్డు మీదకు వస్తే తిరిగి ప్రజలతో, కార్యకర్తలతో బాండింగ్ నిమిషాల్లో వస్తుందని చెప్పుకొచ్చారు. పార్టీలో దీని పైన చర్చ జరిగిందన్నారు. కార్యకర్తలకు జగన్ అండగా ఉంటారన్నారు. కార్యకర్తల కోసం ప్రత్యేకంగా లీగల్ టీంలను ఏర్పాటు చేసారని చెప్పారు. జగన్ ఎంపీగా పోటీ చేయరని..జగన్ జీవించి ఉన్నంత వరకు ఏపీ ప్రయోజనాల కోసం పని చేస్తారని పేర్ని నాని వెల్లడించారు.












Click it and Unblock the Notifications