జనసేనలోకి ఆ వైసీపీ సిట్టింగ్ ఎంపీ..! ముహుర్తం ఖరారు !
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు ఇతర పార్టీలకు వరంగా మారుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు గ్రాఫ్ తగ్గిందన్న సాకుతో మరోసారి అవకాశం ఇవ్వకూడదని జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. దీంతో ఆయా పార్టీలు కూడా ఈ సిట్టింగ్ ప్రజాప్రతినిధుల్ని చేర్చుకునేందుకు సిద్ధమైపోతున్నాయి.
ఇదే క్రమంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరికి మరోసారి టికెట్ ఇవ్వకూడదని జగన్ తీసుకున్న నిర్ణయం ఆయన్ను సొంత పార్టీకి దూరం చేసింది. తాజాగా వైసీపీకి రాజీనామా కూడా ప్రకటించిన బాలశౌరి.. ఇప్పుడు జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను కలిసిన బాలశౌరి జనసేనలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. దీంతో పవన్ కూడా ఆయన్ను చేర్చుకునేందుకు సై అనేశారు.

ఈ క్రమంలో వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరేందుకు ఫిబ్రవరి 4న ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 4న పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన సమక్షంలోనే బాలశౌరి జనసేన ప్రాథమిక సభ్యత్వం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మచిలీపట్నం నుంచే ఆయన్ను ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం ఉంది. మచిలీపట్నంలో తన గ్రాఫ్ బాగానే ఉందని భావిస్తున్న బాలశౌరి అక్కడి నుంచే మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలే టీడీపీకి పట్టున్న జిల్లా కావడంతో టీడీపీ-జనసేన పొత్తు తనకు కలిసి వస్తుందని బాలశౌరి భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications