అప్పుడు బాలయ్య..ఇప్పుడు కృష్ణప్రియ- చంద్రబాబు ఓల్డ్ లాజిక్
హైదరాబాద్/నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. లైంగికంగా వేధింపుల కేసులో ఆయనపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నారాయణ తనను లైంగికంగా వేధిస్తోన్నాడంటూ ఆయన తమ్ముడి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి భార్య కృష్ణ ప్రియ ఆరోపించిన విషయం తెలిసిందే. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆమె రెండు రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను పోస్ట్ చేశారు. నారాయణ తనను లైంగికంగా హింసించేవాడని, లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు.

ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది. తన భార్య మానసిక వ్యాధితో బాధపడుతోందంటూ నారాయణ సోదరుడు పొంగూరు సుబ్రహ్మణ్యం చేసిన ఆరోపణలపై స్పందించింది. పరువు పోతుందంటే మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చేయాలని, అదే చంద్రబాబు లాజిక్ అంటూ ఎద్దేవా చేసింది. కొద్దిసేపటి కిందటే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో విమర్శలు గుప్పించింది.
మొదటి నుంచీ తెలుగుదేశానికి, ఆ పార్టీ నాయకులకు మహిళలు అంటే చులకనే అని ఆరోపించింది. ఒకడేమో ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటూ పరోక్షంగా హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ గతంలో చేసిన స్టేట్‌మెంట్లను ప్రస్తావించింది.

కారు షెడ్‌లో ఉండాలి.. ఆడది ఇంట్లో ఉండాలి.. అంటూ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సీపీ గుర్తు చేసింది. కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలనూ ఈ సందర్భంగా ప్రస్తావించింది వైఎస్ఆర్సీపీ. కాల్ మనీ పేరిట మహిళలను వేధించుకుతిన్నది కూడా టీడీపీ నాయకులేనని పేర్కొంది.
కోడలిని వేధించిన కేసులు ఎదుర్కొన్న కన్నా లక్ష్మీనారాయణ కూడా టీడీపీలోనే ఉన్నాడని వైసీపీ ఎదురుదాడికి దిగింది. తమ పరువు, ప్రతిష్ఠకు భంగం కలుగుతాయనిపిస్తే- వెంటనే టీడీపీకి అధికారిక రోగం మెంటల్ గుర్తుకు వస్తుందని చురకలు అంటించింది. ఇది టీడీపీకి బాగా అలవాటేనని ఎద్దేవా చేసింది. అప్పట్లో బాలయ్య, ఇప్పుడు పొంగూరు ప్రియకు మెంటల్ అంటగట్టి జనం కళ్లకు గంతలు కడుతున్నారని ధ్వజమెత్తింది.












Click it and Unblock the Notifications