మజ్జి సిరి కులంపై వివాదం: అసలు పేరు ఇదే- వైసీపీ ఫిర్యాదు
విజయనగరం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు, తెర్లాం జెడ్పీటీసీ అభ్యర్థి మజ్జి సిరి కులం వ్యవహారం దుమారం రేపుతోంది. జిల్లాలోని తెర్లాం జెడ్పీటీసీ స్థానం నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఇది.. బీసీలకు కేటాయించిన ఈ స్థానం కావడం ఈ వివాదానికి కేంద్రబిందువు అయింది. మజ్జి సిరి అగ్రవర్ణానికి చెందిన వారని, చట్టపరమైన ఆధారాలు లేకుండా బీసీ రిజర్వేషన్ కింద నామినేషన్ దాఖలు చేశారనేది తాజా ఆరోపణ.
దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు విజయనగరం జిల్లా రిటర్నింగ్ అధికారికి లిఖితపూరకంగా ఫిర్యాదు అందజేసింది. ఇందులో పొందుపరిచిన వివరాల ప్రకారం.. మజ్జి సిరి అసలు పేరు ముస్కాన్ జైన్ అని, ఆమె రమేష్ కుమార్ జైన్ కుమార్తె అని స్పష్టం చేశారు. ఏపీలో జైన సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చలేదని గుర్తుచేశారు. మజ్జి శ్రీనివాసరావు, సునీత దంపతులకు ఆమె దత్తత వెళ్లారన్న కారణంతో జన్మతః వచ్చిన కులం హోదా మారదని చట్టపరమైన అంశాలను ఉదహరించారు.

తూర్పు కాపు కేటగిరీ కింద మజ్జి సిరి దాఖలు చేసిన నామినేషన్ చట్టరీత్యా చెల్లదని, ఆమెకు ఈ రిజర్వేషన్ వర్తించదని పేర్కొన్నారు. కులం అర్హతతో పాటు నామినేషన్ డిపాజిట్ మొత్తం చెల్లింపులోనూ నిబంధనలు ఉల్లంఘించారని వైసీపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనలోని హ్యాండ్‌బుక్ ఛాప్టర్ 5, రూల్ 2 (ఐ) ప్రకారం ఓసీ అభ్యర్థులు రూ. 6,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉండగా.. బీసీ అభ్యర్థిగా పేర్కొంటూ మజ్జి సిరి రూ. 3,000 మాత్రమే చెల్లించారని తెలిపారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన పూర్తి రుసుమును చెల్లించడంలో విఫలమైనందున నామినేషన్‌ను తక్షణమే తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. కుల ధృవీకరణ పత్రాలు చట్టం దృష్టిలో నిరర్థకమని, వాటిని ప్రామాణికంగా పరిగణించి పోటీకి అనుమతించకూడదని రిటర్నింగ్ అధికారిని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ స్థానాల విషయంలో అర్హులైన అభ్యర్థుల హక్కులు దెబ్బతినకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
మజ్జి సిరి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించాలని, అలా చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విజయనగరం జిల్లా వైఎస్ఆర్పీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీ ఛైర్ పర్సన్ గా మజ్జి సిరి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.














Click it and Unblock the Notifications
