ఇది కదా పోటీ అంటే...ఒకే నియోజకవర్గం నుంచి బరిలో గురు శిష్యులు ..?
ఏపీలో ఎన్నికల వాతవరణం కనిపిస్తుంది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎంపికలో తలమునకలై అవుతున్నాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార వైసీపీ ముందంజలో ఉందనే చెప్పాలి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ..తాజాగా విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంకు సంబంధించి పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అవంతి శ్రీనివాస్‌కే వైసీపీ అధిష్టానం తిరిగి టికెట్‌ను కేటాయించింది.
గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి సబ్బం హరి మీద ఘన విజయం సాధించారు. జగన్ తొలి మంత్రివర్గంలోనే అవంతి చోటు కూడా సంపాదించారు. అయితే అవంతికి వ్యతిరేకంగా పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో..వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్‌కి టికెట్ ఇస్తారో లేదో అనే అనుమానం నెలకొంది. కాని జగన్ అవంతి శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు.గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువు తీసుకురావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంపై టీడీపీ కూడా కన్నేసింది. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బరిలో దిగుతారని సమాచారం. 2014 ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ,మంత్రిగా కూడా పని చేశారు. 2019 ఎన్నికల్లో గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన రాబోవు ఎన్నికల్లో తిరిగి భీమిలి నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. గంటా ఎక్కడ సీటు అడిగిన ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం రెడీగా ఉంది.

ఒకవేళ గంటా భీమిలి నుంచి బరిలోకి దిగితే, పోటీ రసవత్తరంగా మారుతుందనే టాక్ వినిపిస్తుంది. గంటా శ్రీనివాసరావు శిష్యుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అవంతి శ్రీనివాస్..తరువాత ఆయనతో విభేదించి వైసీపీలో విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. ఒకనొక సమయంలో గంటా వైసీపీలో చేరాలని ప్రయత్నించినప్పుడు ..ఆయన రాకను అవంతి అడ్డుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనుండటంతో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ భీమిలి నియోజకవర్గంలో నెలకొంది.












Click it and Unblock the Notifications