లంచాలు తీసుకుని కంచాలు కొడతారా ? టీడీపీపై సాయిరెడ్డి ఫైర్-ఢిల్లీలో కొట్టాలని హితవు...
ఏపీలో స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మోత మోగిద్దాం పేరుతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీకి ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. లంచాలు తీసుకుని కంచాలు కొడతారా, బకాసురుడి బామ్మర్దులంతా కృష్ణుడి వేషం వేస్తారా, అవినీతికి పాల్పడిన వారంతా సింగారాలు చేసుకుని బయటికొచ్చి కంచాలు మోగిస్తారా అని ప్రశ్నించారు.
2014 నుంచి ఐదేళ్ల పాటు మోగించిన అవినీతి మోత కారణంగా ఇంట్లో ఈగల మోత, బయట కంచాల మోత వినిపిస్తోందని విజయసాయిరెడ్డి టీడీపీపై మండిపడ్డారు. సీఐడీ అరెస్టును క్వాష్ చేయడానికి చంద్రబాబు సీఐడీ కోర్టుకు, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా రిలీఫ్ దొరకలేదన్నారు. ఈ మూడు కోర్టులు కూడా తిరస్కరించడం వల్లే చంద్రబాబు జైల్లో ఉన్నారన్నారు. కంచాలు ఎవరికోసం మోగిస్తున్నారు, ఏపీ ప్రజల కోసమా, రాష్ట్రం కోసమా, దేశం కోసమా అని ప్రశ్నించారు. ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారని అడిగారు.

స్కిల్ స్కాంలో చంద్రబాబు చేసిన పనేంటి, నిరుద్యోగుల కంచాల్లో అన్నం పెట్టి వారికి చెందాల్సిన ధనాన్ని అడ్డంగా దోచుకున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. ఐదేళ్లు లంచాలు తిన్నవాళ్లంతా ఇప్పుడు కంచాలు మోగిస్తారా అని నిలదీశారు. పేదలకు వైసీపీ ప్రభుత్వం 2.35 లక్షల కోట్ల సంక్షేమ పథకాల కింద అందిస్తే చంద్రబాబు ఐదేళ్లలో నిరుపేదలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకుండా కేంద్రం నిధులు ఊదేసినందుకు టీడీపీ వాళ్లు కంచాలు మోగిస్తారా అని ప్రశ్నించారు.
అవినీతి చేసి బస్సులో పడుకున్నాను అన్నందుకు కంచాలు మోగించాలా అని అడిగారు.
చట్టబద్ధంగా అరెస్ట్ అయిన వ్యక్తి కోర్టుల్ని, చట్టాన్ని అపహాస్యం చేస్తారా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. అవినీతి అక్రమం, అరెస్టు సక్రమం, దాన్ని అవినీతి సక్రమం, అరెస్టు అక్రమం అని అంటున్నారన్నారు. చట్టాలపై నమ్మకం లేని అసాంఘిక శక్తులు టీడీపీ కార్యకర్తలే అన్నారు. చంద్రబాబు అవినీతికీ, స్కిల్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్ధలూ కేసులు నిర్ధారించాయి, నలుగురిని అరెస్టు చేశాయన్నారు. రెండు వారాలుగా లోకేష్ ఈడీ ఆఫీసు ఎదురుగా నిలబడి ఢిల్లీలో దాక్కున్నాడని విమర్శించారు.
చంద్రబాబు అరెస్టు అక్రమమని, ఈడీ అరెస్టులు అక్రమమని భావిస్తే ఈడీ ఆఫీసు ముందు కంచాలు కొడితే బాగుంటుందన్నారు.

స్కిల్ స్కాంలో నలుగురిని అరెస్టు చేసింది సీఐడీ కాదని కేంద్ర సంస్ధలని, కాబట్టి ప్రధాని, హోంమంత్రి కార్యాలయాల ముందు నిలబడి నలుగురు టీడీపీ ఎంపీలు, తమ ఎమ్మెల్యేలు, పురందేశ్వరి, రామకృష్ణ, రేవంత్ రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్, జయప్రకాష్ నారాయణ కలిసి కంచాలు కొట్టాలని సాయిరెడ్డి సూచించారు. ఐటీ శాఖ 118 కోట్ల చంద్రబాబు అవినీతిని నిర్ధారించింది. దర్యాప్తు జరిపి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి అవినీతి సొమ్మేనని షోకాజ్ నోటీసు ఇచ్చిందని, ఇది కేంద్ర ఆర్ధిక శాఖ కిందకు వస్తుంది కాబట్టి అక్కడ కంచాలు మోగించాలన్నారు.












Click it and Unblock the Notifications