కలిసొస్తుందా?: నేడే 'మహాధర్నా'.. హోదా కోసం ఢిల్లీలో వైసీపీ ఫైట్
Recommended Video

న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ మలి విడుత సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహాధర్నాకు సిద్దమైంది. 'హోదా' గళాన్ని ఢిల్లీలో వినిపించేందుకు సంసద్‌మార్గ్‌లో మహా ధర్నాను చేపట్టబోతోంది. మహాధర్నా కోసం ఇప్పటికే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలారు.

భారీ జన సమీకరణ..:
మహాధర్నా నేపథ్యంలో వైసీపీ భారీ జన సమీకరణ చేపట్టింది. ఇందుకోసం విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు ద్వారా ఆదివారం కార్యకర్తలను, సామాన్య ప్రజలను తరలించింది.
ఢిల్లీలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేశారు. భోజనంతో పాటు వసతి ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ఏపీ, హైదరాబాద్ తో పాటు బెంగళూరు నగరం నుంచి కూడా వేలాదిగా జనం తరలివచ్చినట్టు చెబుతున్నారు.

వైసీపీకి కలిసొచ్చేలా..:
కొన్నాళ్ల పాటు హోదా అంశం ఏపీలో తెరమరుగైపోయిన సంగతి తెలిసిందే. టీడీపీ పూర్తిగా ప్యాకేజీ మాటకే పరిమితమైనప్పటికీ.. వైసీపీ మళ్లీ హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది.
దీంతో అటు ప్యాకేజీ సాధించలేక.. ఇటు హోదా గురించి మళ్లీ మాట్లాడక తప్పని పరిస్థితుల్లో టీడీపీ ఇరకాటంలో పడింది. ఇదే ఊపులో టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు.. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల పట్ల వైసీపీకి ఎంత చిత్తశుద్ది ఉందో చూపించేందుకు వైసీపీ మహాధర్నాను ఉపయోగించుకోనుంది.

జాతీయ స్థాయిలో చాటేందుకే..: విజయసాయి
మా పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ప్రత్యేక హోదా లభిస్తుందనే నమ్మకం ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి హోదా రాకపోవడానికి కారణం సీఎం చంద్రబాబునాయుడే అని ఆరోపించారు.
కేంద్రంపై ఒత్తిడి తేలేక పోవడం ఒక తప్పిదం అయితే హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అని మభ్యపెట్టి అంగీకరించడం మరో తప్పిదం అన్నానరు. మా పోరాటానికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశ ఉందన్నారు. హోదా ఆకాంక్షను జాతీయ స్థాయిలో చాటేందుకే మహాధర్నా చేపట్టామని తెలిపారు.

కలిసొస్తుందా?:
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న కార్యక్రమాలన్ని కేవలం పొలిటికల్ స్టంట్స్ అని టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ మాత్రం 'హోదా' అంశం ద్వారా ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపించాలని భావిస్తోంది. టీడీపీ కంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామే ఎక్కువ కష్టపడుతున్నామన్న భావన కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలన్ని భవిష్యత్తులో ఆ పార్టీకి కలిసొస్తాయా?.. వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications