రాష్ట్ర ప్రజలకు ఉగాదికి శుభవార్త చెప్పనున్న వైఎస్ జగన్
YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు.
175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 27వ తేదీన ఉదయం కడప జిల్లాలోని ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళి అర్పించిన అనంతరం జగన్ బస్సు యాత్రలో పాల్గొంటారు.

ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కమలాపురం మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుని, అక్కడే తొలి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 28వ తేదీన నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో జగన్ ప్రజలను కలుసుకుంటారు. సాయంత్రం నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొంటారు.
29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా పర్యటనలకు తాత్కాలికంగా విరామం ఉంటుంది. శనివారం అంటే 30వ తేదీన కర్నూలు లోక్‌సభ పరిధిలోని ఎమ్మిగనూరులో జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత వరుసగా- అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా బస్సు యాత్ర సాగుతుంది.
ఏప్రిల్ 8వ తేదీన విజయవాడకు చేరుకుంటారు జగన్. ఆ మరుసటి రోజు అంటే 9వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం వేడుకల్లో పాల్గొంటారు. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి హాజరవుతారు. అదే కార్యక్రమంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు జగన్. ఆ తరువాత ఈ నెల 21వ తేదీ వరకు విరామం లేకుండా మేమంతా సిద్ధం బస్సు యాత్రను నిర్వహిస్తారు.
ఈ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో ఉండొచ్చని చెబుతున్నారు. నవరత్నాల తరహాలోనే సమాజంలోని అన్ని వర్గాల వారిని, అన్ని సామాజిక వర్గాలనూ ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. మహిళలు, రైతుల, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications