వైసీపీ ఎంపీ అభ్యర్థిపై దాడి: కారు ధ్వంసం
Nandigam Suresh: ఏపీలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 40.26 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.
పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీకి చెందిన నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కారును వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై టీడీపీ నాయకులు దాడులకు దిగారు.జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెంలో కూడా ఇలాంటి దాడుల ఘటనలు సంభవించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాపట్ల లోక్‌సభ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ కారుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.

దాడి సమయంలో నందిగం సురేష్ కారులో లేరు. వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు ఏజెంట్లు కారులో ఉన్నారు. దాడి ఘటనతో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. కారుపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు నందిగం సురేష్‌ను దుర్భాషలాడారు. కారు అద్దాలను పగులగొట్టారు. ఏజెంట్లు బెదిరించారు.అటు శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో కూడా దాడి ఘటనలు సంభవించాయి. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులపై దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం అందింది. వైసీపీ నేత పురుషోత్తం కారుపై వాళ్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ జిల్లా కార్యదర్శి నవీన్‌కు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications