కూటమిలో జెడ్పీ ఛైర్మన్ సీట్ల పంపకాల్లో కీలక మార్పులు- ఎవరికి ఏ సీటు..!?
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాలపై కూటమి పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 28 జడ్పీల్లో అల్లూరి సీతారామరాజు మినహా 27 స్థానాలు కూటమి దక్కించుకుంది. ఎన్నికల సమయంలోనే మూడు పార్టీలు జెడ్పీ స్థానాల పైన ఒక అవగాహనకు వచ్చారు. అయితే, కొన్ని జిల్లాల్లో ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. టీడీపీలో పోటీ పెరిగింది. దీంతో.. మిగిలిన రెండు పార్టీల కు తొలుత అనుకున్న సీట్లలో మార్పు కనిపిస్తోంది. తుది చర్చల వేళ.. మూడు పార్టీల్లో ఎవరికి ఏ సీటు దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీలో కూటమి గెలిచిన 27 జెడ్పీ స్థానాల్లో ఎవరికి ఏ సీటు కేటాయింపు విషయం పైన తుది చర్చ లు సాగుతున్నాయి. తొలుత జనసేనకు 5, బీజేపీకి ఒక సీటు కేటాయించేలా సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు. అయితే, జిల్లాల నుంచి వస్తున్న ఒత్తిడితో తాజాగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నెల 20న జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో.. ఈ రోజు లిస్టు ఫైనల్ చేసే విధంగా తుది చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాల్లో పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. స్పష్టత వచ్చిన స్థానాలకు ఈ రోజు(బుధవారం) , పెండింగ్‌లో ఉన్నవాటికి 19న పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. కడప జడ్పీ చైర్మన్ పదవిని బీజేపీ కోరగా, కీలకమైన ఈ స్థానాన్ని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తమ కుటుంబ సభ్యుడికి జెడ్పీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలోనూ అంతర్గత రేసు తీవ్రంగా ఉంది.

తుది కసరత్తు
ఇక, జనసేనకు ఇచ్చే సీట్ల విషయంలోనూ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనకు పల్నాడు, శ్రీసత్యసాయి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు ఖాయమని పార్టీ నేతలు భావించారు. అదే విధంగా తిరుపతి జిల్లా వైస్ ఛైర్మన్ పోస్టు జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఇవి మారనున్నట్లు తెలుస్తోంది. ఇక.. సత్య సాయి జిల్లా జనసేనకు ఇవ్వకుంటే పరిటాల శ్రీరామ్ కు సీటు ఖాయం కానుంది. ఇక.. విజయనగర జిల్లా జెడ్పీ సీటు పై మజ్జి సిరి ఆశలు పెట్టుకోగా.. చంద్రకళ రేసులో ముందుకు వచ్చారు. అదే విధంగా శ్రీకాకుళంలో టీడీపీ నుంచి ఆమదాలవలస జడ్పీటీసీ తమ్మినేని సుజాత.. జనసేన నుంచి ఎల్‌ఎన్‌పేట జడ్పీటీసీ భవాని రేసులో ఉన్నారు. పశ్చిమగోదావరిలో టీడీపీ నుంచి గణపవరం జడ్పీటీసీ ఇందుకూరి రామకృష్ణరాజు, జనసేన నుంచి ఉండి జడ్పీటీసీ పీవీఎల్ నరసింహరాజు మధ్య పోటీ ఉంది. తూర్పుగోదావరి జనసేనకు వెళ్లే అవకాశముందని, కడియం జడ్పీటీసీ రత్నం మహేశ్వరీదేవి పేరు ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. దీంతో.. కూటమి జెడ్పీ ఛైర్మన్ ల అభ్యర్ధుల తుది జాబితా పైన ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications
