Asia Cup 2023: రోహిత్ సేన పాలిట విలన్?- సూపర్ 4 చేరాలంటే..?!
కొలంబో: ఆసియా కప్ 2023లో భారత జట్టు విషమ పరీక్షను ఎదుర్కొంటోంది. గ్రూప్ ఏలో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. రోహిత్ సేన ముందు చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని నిర్దేశించింది పసికూన నేపాల్ జట్టు. ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్.. సూపర్ 4లో అడుగు పెట్టగలుగుతుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు.. 48.2 ఓవర్లల్లో 230 పరుగులు చేసింది. నేపాల్ ఇన్నింగ్‌లో మిడిలార్డర్ కుప్పకూలినప్పటికీ- ఓపెనర్లు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. బలమైన భారత జట్టు బౌలింగ్‌ను ఎదుర్కొని నిలిచారు. నిప్పు కణికల్లాంటి బంతులకు ధీటుగా బదులిచ్చారు.

ఓపెనర్లు కుషాల్ భుర్టెల్- 38, ఆసిఫ్ షేక్- 58 పరుగులు చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 65 పరుగులు జోడించారు. ఓపెనర్లు పెవిలియన్ దారి పట్టిన తరువాత టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు. భీమ్ షక్రీ- 7, కేప్టెన్ రోహిత్ పౌడెల్- 5, కుషాల్ మళ్లా- 2 పరుగులు చేశారంతే.
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇన్నింగ్‌ను నిలబెట్టగలిగారు. గుల్షన్ ఝా-23, దీపేంద్ర సింగ్ ఐరే- 29, సోమ్‌పాల్ కమి- 48 పరుగులు చేశారు. వారి పోరాటంతో నేపాల్ 230 పరుగుల స్కోర్ చేయగలిగింది. పోరాడదగ్గ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. టీమిండియా బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా ముందున్న లక్ష్యం 231 పరుగులు. ఈ టార్గెట్‌ను ఛేదించగలిగితేనే జట్టు సూపర్ 4 దశకు చేరుకోగలుగుతుంది. ప్రస్తుతం రోహిత్ సేన బ్యాటింగ్ ఆర్డర్‌ను ఒక్కసారి పరిశీలిస్తే ఈ మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు గానీ.. వాతావరణం ఎలా మారుతుందనేది ఆసక్తి రేపుతోంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే భారత్‌కు దక్కేది ఒక్కపాయింటే. అప్పుడు నేపాల్ కూడా ఒక పాయింట్‌తో భారత్‌కు సమానంగా నిలుస్తుంది. ఈ దశలో నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది.
ఇక గ్రూప్ ఏలో మూడు పాయింట్లతో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. భారత్ ఖాతాలో ఒక్కటే పాయింట్. ఈ మ్యాచ్ గెలిస్తే మూడు పాయింట్లు అకౌంట్‌లో పడతాయి. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్.. చెరో రెండు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. జీరో పాయింట్స్‌తో ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగున నిలిచింది.












Click it and Unblock the Notifications