జేడీఎస్ లో చేరిన యడియూరప్ప మనుమడు, దెబ్బకు దెబ్బ తీస్తున్న రెబల్స్, కథ క్లోజ్!
బెంగళూరు/హాసన్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు సమీప బంధువు. వరసకు మనుమడు, చాలా సంవత్సరాలు యడియూరప్పకు పీఏగా వ్యవహరించిన ఎన్ఆర్. సంతోష్ జేడీఎస్ పార్టీలో చేరిపోవడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తెచ్చిన యడియూరప్ప ఫ్యామిలీలోని వ్యక్తి పార్టీ మారడం కలకలం రేపింది.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి, అప్పట్లో రెబల్ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యడంలో సంతోష్ కీలకపాత్ర పోషించాడు. తరువాత యడియూరప్ప సీఎంగా ఉన్నంతకాలం సంతోష్ కర్ణాటక ప్రభుత్వంలో చక్రం తిప్పాడు. హాసన్ జిల్లాలోని అరసికెరెలో బీజేపీ టిక్కెట్ తనకే వస్తుందని సుమారు మూడు ఏళ్ల నుంచి సంతోష్ స్థానిక ఓటర్లతో టచ్ లో ఉన్నాడు.

ఇప్పటికే టిక్కెట్ వస్తుందనే నమ్మకంతో సంతోష్ భారీ మొత్తంలోనే డబ్బులు ఖర్చు చేశాడని తెలిసింది. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం అరసికెరె బీజేపీ టిక్కెట్ శివలింగేగౌడకు ఇచ్చేసి యడియూరప్ప మనుమడు సంతోష్ కు హ్యాండ్ ఇచ్చింది. టిక్కెట్ దక్కకపోవడంతో సంతోష్ అసహనం వ్యక్తం చేశాడని తెలిసింది. యడియూరప్ప కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు.
సంతోష్ కు టిక్కెట్ ఇప్పించకపోవడంతో యడియూరప్ప మీద ఆయన సోదరి బీఎస్ ప్రేమా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఇక లాభం లేదని తెలుసుకున్న సంతోష్ శుక్రవారం రాత్రి మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, మాజీ మంత్రి హెచ్. డీ. రేవణ్ణతో రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. అరసికెరె జేడీఎస్ టిక్కెట్ నీకే ఇస్తామని మాజీ ప్రధాని దేవేగౌడ సంతోష్ కు హామీ ఇచ్చారని తెలిసింది.
శనివారం మాజీ ముఖ్యమంత్రి హెచ్. డీ. కుమారస్వామి సమక్షంలో యడియూరప్ప మనుమడు సంతోష్ అధికారికంగా జేడీఎస్ పార్టీలో చేరిపోయారు. కర్ణాటకలో ఇంతకాలం బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న యడియూరప్ప ఫ్యామిలీలోని ఓ వ్యక్తి జేడీఎస్ పార్టీలో చేరడం హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఎంపీ. కుమారస్వామి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పేసి సంతోష్ బాటలోనే జేడీఎస్ పార్టీలో చేరిపోయారు.












Click it and Unblock the Notifications