UPI: 10 ఏళ్ల ప్రస్థానం, దశాబ్ద కాలంలో విశ్వరూపం.. ప్రధాని రియాక్షన్
టీ తాగినా, సూపర్‌మార్కెట్‌లో గ్రాసరీస్ కొన్నా.. అంతా స్కానింగే ఇప్పుడు. మన భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ రూపురేఖలను పూర్తిగా మార్చేసిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ -యూపీఐ.. విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ అపూర్వ ప్రయాణాన్ని భారతదేశ డిజిటల్ చరిత్రలోనే ఒక అతిపెద్ద మలుపుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సామాన్యుడి జీవితంలో యూపీఐ తెచ్చిన మార్పులను, వారి అనుభవాలను పంచుకోవాలని ప్రధాని సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలను కోరారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలతో 2016 ఏప్రిల్‌లో కేవలం 21 బ్యాంక్‌ల భాగస్వామ్యంతో ఒక ప్రయోగంగా యూపీఐ ప్రయాణం ప్రారంభమైంది. అదే సంవత్సరం ఆగస్టు 25న పూర్తిస్థాయిలో ప్రజా వినియోగానికి అందుబాటులోకి వచ్చింది. బ్యాంకింగ్ అప్లికేషన్లు ప్లే స్టోర్‌లోకి రావడం, ఆ తర్వాత 2016 డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన 'భీమ్' (BHIM) యాప్‌తో మన దేశంలో డిజిటల్ కరెన్సీ వాడకం గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి శరవేగంగా విస్తరించింది.

13 వేల రెట్లు పెరిగిన లావాదేవీలు: ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కలివే!
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం యూపీఐ వృద్ధి ఊహకందని స్థాయిలో నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్లుగా ఉన్న ఏడా ది మొత్తం లావాదేవీలు, 2025-26 నాటికి ఏకంగా 24,162 కోట్లకు చేరాయి. అంటే లావాదేవీల సంఖ్య సుమారు 13,000 రెట్లు పెరిగింది.
చెల్లింపుల విలువ 2016-17లో రూ.0.07 లక్షల కోట్లు ఉంటే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి అది రూ.314 లక్షల కోట్లకు చేరడం విశేషం. ఇది 4,000 రెట్లకు పైగా భారీ వృద్ధిని సూచిస్తోంది.
దేశ సరిహద్దులు దాటిన భారత నయా సాంకేతికత!
భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మన యూపీఐ రికార్డులు సృష్టిస్తోంది. గ్రీస్, మాల్దీవులు వంటి దేశాలు ఇటీవలే మన యూపీఐ వ్యవస్థను స్వీకరించడంతో, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో భారత డిజిటల్ చెల్లింపులు చెల్లుబాటు అవుతున్నాయి.
ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే ఒకే ఒక్క మొబైల్ యాప్‌తో అనుసంధానించే సౌలభ్యం, టూ-ఫాక్టర్ అథెంటికేషన్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి భద్రతా ప్రమాణాలు ఉండటంతో ప్రపంచ దేశాలు భారత్ మోడల్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. మర్చంట్ డిజిటల్ లావాదేవీలకు సంబంధించి పీఎస్‌ఎస్ (PSS) చట్టానికి సవరణలు చేసినా, సాధారణ వినియోగదారులకు ఎలాంటి అదనపు రుసుములు లేకుండా ఉచిత సేవలు అందించడమే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.














Click it and Unblock the Notifications