Adani: విశాఖలో అదానీ భారీ స్కెచ్! 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో
విశాఖపట్నం వేదికగా భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక మహా విప్లవానికి శ్రీకారం చుట్టిందని అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ ప్రకటించారు. 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్దదని, ఇది భారత్‌ను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 1.3 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం ఉండగా, ఒక్క విశాఖలోనే 1 గిగావాట్ ఏర్పాటు చేయడం విశాఖ ప్రాముఖ్యతను చాటిచెబుతోందని అన్నారు.
దశాబ్దాలుగా ముంబై, చెన్నై నగరాలకే పరిమితమైన డిజిటల్ గేట్‌వేలు ఇకపై విశాఖకు తరలిరానున్నాయని జీత్ అదానీ పేర్కొన్నారు. విశాఖలో ఉన్న సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ మౌలిక సదుపాయాలు ఈ నగరాన్ని 'భారత కొత్త డిజిటల్ గేట్‌వే'గా మారుస్తాయని వెల్లడించారు. దీనివల్ల అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెరగడమే కాకుండా, డేటా ప్రవాహంలో జాప్యం (Latency) తగ్గి ఏఐ పనిభారాలు వేగంగా పూర్తవుతాయని వివరించారు.

ఏఐ అంటే విద్యుత్తు - అదానీ గ్రూప్ మాస్టర్ ప్లాన్
"ఏఐ అనేది కోడ్‌లో వ్రాసినప్పటికీ, అది విద్యుత్తుపైనే ఆధారపడి పనిచేస్తుంది" అని అదానీ స్పష్టం చేశారు. కంప్యూటింగ్ వ్యయాల్లో విద్యుత్ ఖర్చులే కీలకమని, అందుకే స్వచ్ఛమైన, సరసమైన ఇంధనంతో ఏఐ సేవలను ప్రజాస్వామ్యం చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల (సుమారు ₹8.3 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ నిధులతో ఇంధన ఉత్పత్తి, డిజిటల్ నెట్‌వర్క్‌లు మరియు అత్యాధునిక డేటా సెంటర్లను నిర్మించనున్నారు.
విజనరీ సీఎం.. బెంగళూరుకు మించి విశాఖ!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి విజనరీ లీడర్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని జీత్ అదానీ ప్రశంసించారు. గతంలో బెంగళూరు నగరం భారత సాంకేతిక విప్లవానికి ఎలాగైతే కేంద్రమైందో, భవిష్యత్తులో విశాఖపట్నం దేశ ఏఐ విప్లవానికి ఆయువుపట్టుగా మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలతో కలిసి పని చేయడం ద్వారా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను విశాఖకు తీసుకువస్తున్నామని తెలిపారు.
ప్రజాస్వామ్యయుతంగా ఏఐ
తమ ప్రసంగాన్ని ముగిస్తూ, భారతదేశం కేవలం భవిష్యత్తును నిర్మించడమే కాకుండా మేధస్సును కూడా రూపకల్పన చేస్తోందని అదానీ అన్నారు. అతి తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని, ఆ చారిత్రాత్మక ప్రయాణం నేడు విశాఖ నుంచే ప్రారంభమైందని ఆయన ఉద్ఘాటించారు.












Click it and Unblock the Notifications