ఓలా, ఉబర్, ర్యాపిడోకు షాక్.. మార్కెట్ లోకి Bharat Taxi ఎంట్రీ
దేశవ్యాప్తంగా టాక్సీ సేవల రంగంలో కీలకమైన మార్పుకు తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. డ్రైవర్లపై కమిషన్ భారాన్ని తొలగిస్తూ, వారినే భాగస్వాములు చేసే ఉద్దేశంతో ప్రారంభమైన 'భారత్ టాక్సీ (Bharat Taxi)' రైడ్-హైలింగ్ ప్లాట్‌ఫామ్ మూడు సంవత్సరాల్లో దేశమంతా విస్తరిస్తుందని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో ఈ సహకార ఆధారిత టాక్సీ సేవను అధికారికంగా ఆయన ప్రారంభించారు.
ఇప్పటివరకు ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌లలో డ్రైవర్లు భారీ కమిషన్లు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీరో కమిషన్, నో సర్జ్ ప్రైసింగ్, డ్రైవర్‌కి లాభాల్లో వాటా అనే సూత్రాలతో భారత్ టాక్సీ ముందుకొచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో డ్రైవర్లు కేవలం సేవాప్రదాతలే కాదు... యజమానులే.

'సారథి హి మాలిక్' మోడల్లో Bharat Taxi
భారత్ టాక్సీని మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్, 2002 కింద నమోదు చేశారు. ఇందులో చేరే డ్రైవర్లను 'సారథులు'గా పిలుస్తారు. యాప్ ద్వారా వచ్చిన ఆదాయం నేరుగా డ్రైవర్ల ఖాతాలోకి చేరుతుంది. మధ్యలో కమిషన్లు, కట్‌లు ఉండవు. ఇదే ఈ మోడల్‌కు ప్రధాన ఆకర్షణ. పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లో ప్రారంభమైన ఈ సేవకు మంచి స్పందన లభించింది. ఇప్పటికే మూడు లక్షలకుపైగా డ్రైవర్లు, లక్షకు పైగా వినియోగదారులు నమోదు అయ్యారు. రోజుకు సగటున 10 వేలకుపైగా రైడ్లు పూర్తవుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు డ్రైవర్లకు రూ.10 కోట్లకుపైగా ఆదాయం పంపిణీ అయినట్లు వెల్లడించారు.
డ్రైవర్లకు సామాజిక భద్రత
భారత్ టాక్సీ మరో ప్రత్యేకత డ్రైవర్లకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు. ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ తరహా పొదుపు పథకాలు, అత్యవసర సహాయం వంటి సదుపాయాలు ఇందులో భాగంగా ఉంటాయి. "సహకారమే బలమైన ఆర్థిక శక్తి" అన్న నినాదంతో ఈ యాప్‌ను విస్తరిస్తున్నామని అమిత్ షా తెలిపారు.
మూడు సంవత్సరాల్లో దేశమంతా
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ద్వారక నుంచి కామాఖ్య వరకు భారత్ టాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల సహకార సంస్థలు, డ్రైవర్ల సంఘాలతో కలిసి ఈ ప్లాట్‌ఫామ్‌ను విస్తరించనున్నారు.
మార్కెట్‌లో కొత్త పోటీ
డ్రైవర్-ఫ్రెండ్లీ మోడల్‌తో భారత్ టాక్సీ రంగప్రవేశం చేయడంతో ప్రైవేట్ టాక్సీ యాప్‌లకు ఇది పెద్ద సవాలుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రయాణికులకు స్థిర ధరలు, డ్రైవర్లకు గౌరవప్రదమైన ఆదాయం .. ఈ రెండు కలిసే భారత్ టాక్సీని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
#NewDelhi | Union Home and Cooperation Minister @AmitShah launches the 'Bharat Taxi' App.@MinOfCooperatn #BharatTaxi #BharatTaxiApp pic.twitter.com/87URvR80sO
— DD News (@DDNewslive) February 5, 2026












Click it and Unblock the Notifications