EPFO: జాబ్ మారుతున్నారా? కెరీర్ మార్పు వేళ ఈ తప్పు అస్సలు చేయకండి!
ఉద్యోగం లేదా కెరీర్ మారిన ప్రతిసారీ పాత ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బు ఏమవుతుందోనన్న ఆందోళన చాలామందిలో ఉంటుంది. నిజానికి ఉద్యోగం మారినంత మాత్రాన పీఎఫ్ ప్రయాణం ఆగిపోదు. మీ కొత్త ఉద్యోగం ఇపిఎఫ్ఒ పరిధిలోకి వస్తుందా లేదా అనేదానిపైనే మీ కాంట్రిబ్యూషన్లు ఆధారపడి ఉంటాయి. కొత్త కంపెనీకి మారినప్పుడు ఖాతాను ఎలా నిర్వహించాలో తెలుసుకుంటే ఆర్థిక నష్టాలు లేకుండా చూసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి కెరీర్ మొత్తంలో ఒకే ఒక 'యూనివర్సల్ ఒకౌంట్ నంబర్'- UAN ఉంటుంది. మీరు పాత కంపెనీని వీడి ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే కొత్త కంపెనీలో చేరినప్పుడు మీ పాత యూఏఎన్‌ను మాత్రమే అందించాలి. కొత్తగా మరో నంబర్ తీసుకోకూడదు. పాత ఖాతాలోని నిధులను, సర్వీస్ హిస్టరీని కొత్త మెంబర్ ఒకౌంట్‌కు సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికోసం యూఏఎన్, ఆధార్, బ్యాంకు వివరాలతో కూడిన కేవైసీ సరైన రీతిలో లింక్ అయి ఉండాలి.

కంపెనీ/రంగం మారినా నిబంధనలు వర్తిస్తాయా?
మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి తయారీ రంగానికి లేదా ఫైనాన్స్ నుంచి విద్యారంగానికి మారినా సరే.. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొత్త యాజమాన్యం ఈపీఎఫ్ పరిధిలోకి వస్తే పిఎఫ్ కొనసాగుతుంది. అయితే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి సొంత వ్యాపారం వైపు వెళ్తే మాత్రం కనీస ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌లు ఆగిపోతాయి. వ్యక్తిగతంగా సొంతంగా చందాలు చెల్లించే సదుపాయం ఇందులో ఉండదు. కాకపోతే ఉద్యోగంలో ఉన్నంతవరకు విపీఎఫ్ ద్వారా చట్టబద్ధమైన పరిమితి కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసే అవకాశం ఉంది.
పాత పిఎఫ్ డబ్బును వెంటనే ఉపసంహరించుకోవద్దు!
ఉద్యోగం మారగానే పాత ఈపీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. పీఎఫ్ డబ్బును క్లెయిమ్ చేయడం వల్ల చక్రవడ్డీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. పైగా సర్వీస్ కంటిన్యూటీ దెబ్బతింటుంది. కాబట్టి కొత్త కంపెనీలో చేరిన వెంటనే పోర్టల్ ద్వారా పాత నిధులను కొత్త ఖాతాలోకి బదిలీ చేసుకోవడమే శ్రేయస్కరం.
కొత్త ఉద్యోగంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఈపీఎఫ్ఓ సిస్టమ్స్ అన్నింటినీ డిజిటలైజ్ చేసినందున సేవలు చాలా సులభతరం అయ్యాయి. మీ యూఏఎన్ స్టేటస్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం అవసరం. ఒకవేళ మీరు చేరిన కొత్త కంపెనీ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాకపోయినా, పాత ఖాతాలోని డబ్బులు సురక్షితంగానే ఉంటాయి. కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత ఈపీఎఫ్ పాస్‌బుక్ తనిఖీ చేసుకుని, ప్రతి నెలా మీ పిఎఫ్ జమ అవుతుందో లేదో సరిచూసుకోవడం మంచిది.














Click it and Unblock the Notifications