CNG: మోత మోగిపోతున్న సీఎన్జీ ధరలు.. ఏడాదిలో ఎనిమిదో సారి పెంపు..
సామాన్యుడు వాహనం నడపాలంటేనే జనం భయపడేలా పరిణామాలు మారుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో (MMR) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వినియోగదారులకు మరోసారి గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ కొనుగోలు భారం విపరీతంగా పెరిగిపోవడంతో, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సీఎన్జీ ధరలను మరో రూ. 1.50 పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపుతో ముంబైలో కేజీ సీఎన్జీ ధర రూ. 91.50కి చేరుకుంది. ఈ ఏడాదిలో సీఎన్జీ ధరలు పెరగడం ఇది ఏడోసారి కాదు.. ఏకంగా ఎనిమిదోసారి కావడం గమనార్హం.
పశ్చిమాసియా సంక్షోభమే ప్రధాన కారణం..
పశ్చిమాసియాలో (Middle East) నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఎంజీఎల్ సంస్థ స్పష్టం చేసింది. దేశీయంగా సహజ గ్యాస్ కేటాయింపులు తగ్గిపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌పై (RLNG) ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దిగుమతి ధరలు మారుతుండటంతోనే ఈ భారం పడుతోందని, ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం గ్యాస్ సరఫరాను కొనసాగించేందుకే ఈ ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ వివరించింది.

ఇప్పటివరకు ఎంత పెరిగిందంటే?
ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో కేజీ సీఎన్జీ ధర కేవలం రూ. 80.50 మాత్రమే ఉండేది. కానీ ఏడాది పొడవునా జరిగిన వరుస పెంపులతో ఇప్పుడు ధర రూ. 91.50కి చేరింది. అంటే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే దాదాపు 14 శాతం మేర ధరలు కన్నెక్కాయి. కేవలం నవంబర్ నెలలోనే రెండుసార్లు ధరలు పెరగడం గమసార్హం. నవంబర్ 1వ తేదీన రూపాయి పెంచగా, తాజాగా మరో రూపాయిన్నర పెంచారు. సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటివరకు ఒక్క సీఎన్జీపైనే కేజీకి ఏకంగా రూ. 5.50 వరకు భారం పడింది. అయితే ప్రస్తుత పెంపులో కేవలం సీఎన్జీ ధరలను మాత్రమే సవరించినట్లు, పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) ధరల్లో ఎలాంటి మార్పు లేదని కంపెనీ స్పష్టం చేసింది.
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లపై తీవ్రమైన ఆర్థిక భారం
ధరల ఈ నిరంతర పెరుగుదల సామాన్య ప్రజలతో పాటు ఆటోరిక్షా, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఏడాది పొడవునా ఒక్కో నెలలో కొద్దికొద్దిగా పెంచుకుంటూ పోతూ ఎనిమిది సార్లు ధరలు సవరించడంతో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఫిబ్రవరిలో 50 పైసలు, ఏప్రిల్‌లో రూపాయి, మే నెలలో రెండుసార్లు చొప్పున.. ఆ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో వరుసగా ధరలు బాదుకుంటూ పోవడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఏదేమైనా అంతర్జాతీయ పరిణామాలు ఇలాగే కొనసాగితే సామాన్యులపై రవాణా భారం మరింత పెరిగే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
