మీ బంగారం గురించి మా దగ్గర లెక్కలు లేవు.. లోక్ సభలో కేంద్రం ప్రకటన
దేశంలో బంగారం, వెండి దిగుమతులపై పన్నులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. మే నెలలో పన్ను రేట్లను సవరించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు పదివేల కోట్లకు పైగా కస్టమ్స్ సుంకం రూపంలో సమకూరింది. పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాలారాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వివరంగా సమాధానమిచ్చారు.
గోల్డ్ నుంచే సింహభాగం ఆదాయం
కేంద్ర ప్రభుత్వం మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్య కాలంలో బంగారం, వెండి, ప్లాటినం దిగుమతుల ద్వారా మొత్తం రూ. 10,463 కోట్ల కస్టమ్స్ డ్యూటీని వసూలు చేసింది. ఇందులో అత్యధిక భాగం పసిడి దిగుమతుల నుంచే రావడం విశేషం.

కేవలం బంగారం ద్వారానే రూ. 10,040 కోట్ల ఆదాయం రాగా, వెండి దిగుమతుల ద్వారా రూ. 328 కోట్లు, ప్లాటినం ద్వారా రూ. 95 కోట్ల రాబడి కేంద్రానికి లభించింది. మే నెలలో ప్రభుత్వం బంగారం, వెండిపై సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
స్మగ్లర్ల ఆటకట్టు.. భారీగా పసిడి సీజ్
దిగుమతి సుంకాలు పెరిగిన నేపథ్యంలో సరిహద్దుల్లో అక్రమ బంగారం రవాణా కూడా పెరిగే అవకాశం ఉండటంతో కస్టమ్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలోనే ఏకంగా 287 దొంగ రవాణా కేసులను అధికారులు నమోదు చేశారు. వివిధ విమానాశ్రయాలు, సరిహద్దుల్లో దాడులు నిర్వహించి 160.91 కిలోల అక్రమ బంగారాన్ని జప్తు చేయడమే కాకుండా, 116 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ఇళ్లలోని బంగారంపై స్పష్టత లేదు!
భారతీయ కుటుంబాల వద్ద భారీ ఎత్తున వాడుకలో లేకుండా మూలుగుతున్న బంగారం లెక్కలపై కూడా మంత్రి లోక్‌సభలో స్పష్టత ఇచ్చారు. దేశంలో సాధారణ పౌరులు ఎంత పరిమాణంలో బంగారాన్ని కలిగి ఉన్నారనే దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి నిర్దిష్టమైన గణాంకాలు లేదా డేటా అందుబాటులో లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కలిగిన కుటుంబాలు భారత్‌లోనే ఉన్నప్పటికీ, ఆ వివరాల సేకరణ సాధ్యపడలేదని పేర్కొన్నారు.




Click it and Unblock the Notifications