100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!
దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా వెలుగొందుతున్న 'బంగారం' ఇప్పుడు అనూహ్యమైన పతనాన్ని చవిచూస్తోంది. గత వంద ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా పది రోజుల పాటు ధరలు క్షీణించడం అంతర్జాతీయ మార్కెట్లను విస్మయానికి గురిచేస్తోంది. ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి కాంతి ఇప్పుడు మసకబారుతుండటం పెట్టుబడిదారుల్లో గుబులు రేపుతోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయిల నుండి బంగారం ధర ఏకంగా 27 శాతం మేర కుప్పకూలింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం 4,090 డాలర్ల వద్ద నిలదొక్కుకోవడానికి ఆఖరి ప్రయత్నం చేస్తోంది. అయితే, ఎప్పుడూ లేని విధంగా బంగారం ఎందుకు నేలచూపులు చూస్తుందనే అంశంపై ఆర్థిక విశ్లేషకులు ఐదు కీలక కారణాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
పతనం వెనుక ఐదు 'బిగ్' టర్న్స్:
లాభాల స్వీకరణ వెల్లువ:
బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్న తరుణంలో అప్రమత్తమైన బడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చుకోవడం (Profit Booking) ప్రారంభించారు. ఈ భారీ విక్రయాల ఒత్తిడి మార్కెట్‌ను ఒక్కసారిగా కుంగదీసింది.

సాంకేతిక సంకేతాలు:
ట్రేడింగ్ పరిభాషలో చెప్పాలంటే.. బంగారం ధర 4,090 డాలర్ల వద్ద ఉన్న '200-రోజుల మూవింగ్ యావరేజ్'ను తాకడం ఒక కీలక మలుపు. ఈ స్థాయి వద్ద ట్రేడర్లు తమ పొజిషన్లను మార్చుకోవడంతో పతనం మరింత వేగవంతమైంది.
తలకిందులైన సంప్రదాయ అంచనాలు:
సాధారణంగా యుద్ధ వాతావరణం నెలకొంటే బంగారం ధర పెరుగుతుంది. కానీ, ఫిబ్రవరిలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, పసిడి ధర పెరగకపోగా సుమారు 12 శాతం పడిపోవడం విశేషం. ఇది బంగారంపై ఉన్న సాంప్రదాయ నమ్మకాన్ని కొంతవరకు దెబ్బతీసింది.
బిట్‌కాయిన్ పోటీ:
'డిజిటల్ గోల్డ్'గా పిలవబడే బిట్‌కాయిన్ ప్రస్తుతం బంగారానికి గట్టి పోటీనిస్తోంది. పసిడి విలువ తగ్గుతున్న సమయంలో బిట్‌కాయిన్ 70 వేల డాలర్ల పైన స్థిరంగా నిలబడటంతో యువ పెట్టుబడిదారుల దృష్టి క్రిప్టో కరెన్సీ వైపు మళ్లింది.
డబ్బు ప్రవాహం దిశ మార్పు:
పెట్టుబడిదారులు తమ ప్రాధాన్యతలను మారుస్తున్నారనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. గోల్డ్ ఈటీఎఫ్ (ETF)ల నుండి బిలియన్ల కొద్దీ డాలర్లు బయటకు వెళ్లిపోతుండగా, కేవలం ఈ నెలలోనే బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లలోకి సుమారు 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
ఇది కొనుగోలుకు సమయమా?
గత 24 గంటల్లో బంగారం ధర స్వల్పంగా 2 శాతం కోలుకోవడం మార్కెట్ వర్గాల్లో చిన్నపాటి ఆశలు చిగురింపజేస్తోంది. అయితే ఇది పతనం ఆగిపోవడానికి సంకేతమా లేక తాత్కాలిక ఊరటా అనేది మిస్టరీగానే ఉంది. బంగారం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతుందా లేక కొత్త తరం ఆస్తులు దాని స్థానాన్ని ఆక్రమిస్తాయా అనేది వేచి చూడాలి. పసిడి ప్రేమికులకు ఇది మంచి కొనుగోలు అవకాశమా లేక మరింత పతనానికి ఆరంభమా అనే క్లైమాక్స్ రాబోయే రోజుల్లోనే తేలనుంది.












Click it and Unblock the Notifications