DA Hike: డీఏ ప్రకటనకు ముహూర్తం ఖరారు?.. వచ్చే వారమే గుడ్ న్యూస్
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'శుభవార్త' అందే సమయం వచ్చేసింది. 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలులో జాప్యం జరుగుతున్నా, పెరగనున్న కరువు భత్యం (DA) రూపంలో ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లోకి అదనపు నగదు చేరనుంది. జనవరి 2026 నుంచి వర్తించాల్సిన ఈ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే అధికారిక ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి, నిబంధనల ప్రకారం 2026 జనవరి 1 నుంచే కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలులోకి రావాలి. అయితే, కమిషన్ ఏర్పాటులో జరిగిన జాప్యం వల్ల కొత్త జీతాల కోసం ఉద్యోగులు మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. కమిషన్ అధ్యయనానికి, ప్రభుత్వ ఆమోదానికి సుమారు 18 నుంచి 24 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున, 2028 జనవరి నాటికి పూర్తిస్థాయిలో కొత్త వేతనాలు అందుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండేళ్ల విరామంలో పెరిగే డీఏనే ఉద్యోగులకు ప్రధాన ఆర్థిక భరోసా కానుంది.

జీతాలు ఎంత పెరగవచ్చు?
ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు తమ మూల వేతనంలో 58 శాతం కరువు భత్యాన్ని పొందుతున్నారు. తాజా అంచనాల ప్రకారం, ప్రభుత్వం డీఏను మరో 3 శాతం మేర పెంచే అవకాశం ఉంది.
ఉదాహరణకు..
రూ.56,100 బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం రూ.32,538 డీఏ వస్తోంది. పెంపు తర్వాత ఇది 61 శాతానికి (రూ34,221) చేరుతుంది. దీనివల్ల జనవరి నుంచి ఏప్రిల్ వరకు నాలుగు నెలల బకాయిల (Arrears) రూపంలోనే సుమారు రూ.6,732 అదనంగా లభించనున్నాయి.
డీఏ విలీనంపై ఆశలు..
సాధారణంగా డీఏ 50 శాతం మార్కును దాటినప్పుడు, దానిని మూల వేతనంలో విలీనం చేసే సంప్రదాయం గతంలో ఉండేది. ఇప్పుడు డీఏ 58 శాతానికి చేరడంతో, ప్రభుత్వం ఈ దిశగా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందా? అన్న చర్చ కూడా సచివాలయ వర్గాల్లో నడుస్తోంది. ఇదే గనుక జరిగితే ఉద్యోగుల జీతాల నిర్మాణం గణనీయంగా మారుతుంది.
ఏప్రిల్‌లోనే ఎందుకు?
సాధారణంగా జనవరి డీఏ పెంపును హోలీ పండగ సమయంలోనో, మార్చి చివరిలో ప్రకటిస్తారు. ఈసారి 8వ వేతన సంఘం కసరత్తులు, పరిపాలనాపరమైన లెక్కల వల్ల స్వల్ప జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ఈ ప్రకటన వెలువడితే, పెరిగిన జీతంతో పాటు మూడు నెలల బకాయిలు కూడా ఒకేసారి అందుతాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో, ఈ పెంపు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications