రేపటి నుంచి: 25 రోజుల్లో 52 లక్షలకు పైగా పెళ్లిళ్లు: రూ. 7.5 లక్షల కోట్ల బిజినెస్
పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి లక్షల సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. పెళ్లిళ్ల ముహూర్తాలు డిసెంబర్ 15వ తేదీ వరకే ఉండనున్నాయి. అదే నెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోండటం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. దాదాపుగా ఈ 25 రోజుల పాటు ఉండే ఈ వివాహాల సీజన్.. దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఊపునివ్వబోతోందనే అంచనాలు ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.
ఈ 25 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా దాదాపు 52 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది. ఈ ముహూర్తాల సీజన్‌లో ఏకంగా 7.5 లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపారం సాగుతుందని అంచనా వేసింది. ఈ 25 రోజుల్లో దేశంలో రోజుకు సగటున కనీసం రెండు లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని పేర్కొంది. ఫలితంగా మార్కెట్లలో కొనుగోళ్ల సందడి నెలకొనకొనడం ఖాయంగా కనిపిస్తోంది.

దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిందీ కాన్ఫెడరేషన్. 550 వ్యాపార సంఘాలు, 300 మంది ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించింది. ఈ పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లు.. బంగారం, దుస్తులు, కేటరింగ్, రవాణా, హోటల్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వంటి అనేక రంగాలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టనున్నాయని తెలిపింది. ఆయా సెగ్మెంట్ లల్లో హోల్ సేల్ నుంచి రిటైల్ వ్యాపారం వరకూ దీని ప్రభావం ఉండబోతోందని వివరించింది.
మొత్తం అంచనా వేసిన వ్యాపారంలో రిటైల్ విక్రయాలు 54 శాతం.. అంటే రూ. 4.05 లక్షల కోట్లుగా సీఏఐటీ అంచనా వేసింది. సర్వీస్ రంగం వాటా 46 శాతం. దీని విలువ రూ. 3.45 లక్షల కోట్లు. వినియోగదారుల ఖర్చులో అత్యధికంగా బంగారు భరణాలు, వెండి కొనుగోళ్లకు రూ. 1.2 లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. నూతన దుస్తుల కొనుగోళ్లు రూ. 90,000 కోట్లు దాటొచ్చు. వీటితో పాటు నిత్యావసర వస్తువులు, బహుమతులకు చెరో రూ. 37,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్, డ్రై ఫ్రూట్స్, ఫర్నిచర్ కు రూ. 30,000 కోట్ల వరకు వ్యాపారం జరగొచ్చని సీఏఐటీ తెలిపింది.
సర్వీస్ సెగ్మెంట్ లో కేటరింగ్ విభాగం రూ. 75,000 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కళ్యాణ మంటపాలు, బాంక్వెట్ హాళ్లు, హోటళ్ల బుకింగ్స్ ద్వారా రూ. 60,000 కోట్ల ఆదాయం రానుంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, డెకొరేషన్ కు రూ. 37,500 కోట్లు చొప్పున ఖర్చవుతాయని సీఏఐటీ రిపోర్ట్ పేర్కొంది. ఫొటోగ్రఫీ, కాస్మెటిక్, రవాణా విభాగాల్లో సుమారు 1.25 కోట్ల మందికి ఉపాధి లభించనుంది. ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ లోనే అయిదు లక్షల వివాహాల ద్వారా రూ. 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపింది.
కొన్నేళ్లుగా దేశంలో వివాహాల సంఖ్యతో పాటు వాటి నిర్వహణకు చేసే వ్యయం కూడా విపరీతంగా పెరుగుతోందని, సాధారణ కుటుంబాల్లో పెళ్లిళ్ల వ్యయం రూ. 4- 5 లక్షల వరకు ఉండగా.. ప్రీమియం వెడ్డింగ్స్ కోసం చేసే ఖర్చు 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఉంటోందని, రాబోయే సీజన్ లో దీని సంఖ్య మరింత పెరగొచ్చని సీఏఐటీ వివరించింది. గత నాలుగేళ్లుగా పెళ్లిళ్ల కోసం చేస్తోన్న ఖర్చు వివరాలను కూడా ఈ రిపోర్ట్ పొందుపరిచారు. 2022లో రూ. 3.75, 2023 లో రూ. 4.74, 2024లో 5.90, 2025 లో 6.50 లక్షల కోట్లను వెచ్చించారు.













Click it and Unblock the Notifications
