కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!!
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూ వస్తోంది. అయిదో రోజు కూడా దీనికి బ్రేకులు పడట్లేదు. ఈ యుద్ధానికి ఎపిక్ ఫ్యూరీగా పేరు పెట్టింది అమెరికా. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ పరిణామాలు భారత్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రూపాయి విలువ భారీగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతంగా రికార్డు స్థాయిలో క్షీణించింది. ఒక డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ ఏకంగా 92 రూపాయలను దాటేసింది. ఒక దశలో గరిష్టంగా 92.10 పైసలకు చేరింది. ఒకేసారి 55 పైసల మేర క్షీణించింది. కిందటిరోజు 91.47 వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ ఉదయం డాలర్‌తో పోలిస్తే 55 పైసలు బలహీనపడింది. 92.03 వద్ద ప్రారంభమైంది. ఇది క్రమంగా 92.08 పైసలకు తాకింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ విలువ ఏడు శాతం పైగా పతనమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 87 రూపాయల వరకు కనిపించిన రూపాయి విలువ మూడో త్రైమాసికం చివరి నాటికి 90 రూపాయలను దాటిందంటే దాని పతనం ఎంత వేగంగా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అది అక్కడితో ఆగలేదు. 92 రూపాయలను కూడా దాటేసింది. సురక్షిత ఆస్తుల వైపు విదేశీ పెట్టుబడులు, దేశీయ ఈక్విటీల నుండి నిధుల ఉపసంహరణ రూపాయి క్షీణతకు కారణమయ్యాయి.
కొద్ది రోజుల కిందటే 91 రూపాయల మార్క్ ను దాటింది రూపాయి విలువ.. అతి తక్కువ సమయంలోనే 92 ను కూడా దాటడం అనేది అత్యంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధార పడి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తడిలోకి నెట్టినట్టవుతుంది. ఇది రికార్డు స్థాయి పతనం. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో రూపాయి విలువ దిగజారిపోలేదు.
రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడంతో అటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. అటు స్టాక్ మార్కెట్ పై కూడా దీని దుష్ప్రభావం పడింది. సెన్సెక్స్ భారీగా నష్టపోతోంది. బోంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నష్టాలతో ఆరంభం అయ్యాయి.












Click it and Unblock the Notifications