రూపాయి చరిత్రలోనే బ్లాక్ డే.. ఒక్క రోజులోనే అత్యంత కనిష్ఠానికి పతనం!
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ రాజుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో భారత రూపాయి విలువ ఘోరంగా పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే మంగళవారం ఒక్కరోజే రూపాయి ఏకంగా 62 పైసలు బలహీనపడి, మునుపెన్నడూ లేని విధంగా 96.30 వద్ద ముగిసింది. అంతకుముందు సోమవారం నాడు కూడా రూపాయి విలువ 30 పైసలు క్షీణించి 95.68 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల్లోనే రూపాయి ఈ స్థాయిలో పతనం కావడం దేశీయ మార్కెట్లను కలవరపెడుతోంది.
రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఇవే
అంతర్జాతీయంగా చమురు రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' గుండా సరఫరాకు ఆటంకాలు ఎదురవుతాయనే ఆందోళనలతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కసారిగా 3.75 శాతం పెరిగి బ్యారెల్‌కు 86.42 డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే అమెరికన్ డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీంతో డాలర్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పడింది.

భారత్ తన అవసరాలకు కావాల్సిన ముడిచమురులో 85 శాతానికి పైగా ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లు భారీగా పెరిగి, డాలర్ల రూపంలో చెల్లింపులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలపై ప్రభావం చూపి రూపాయిని మరింత బలహీనపరుస్తోంది.
స్టాక్ మార్కెట్లు కూడా కుదేలు!
రూపాయి పతనం, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం దేశీయ షేర్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఏకంగా 561.46 పాయింట్లు నష్టపోయి 77,054.94 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 158.95 పాయింట్లు పతనమై 24,052.05 వద్ద ముగిసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) సోమవారం ఒక్కరోజే రూ. 3,062.27 కోట్ల విలువైన షేర్లను అమ్మేసి బయటకు వెళ్లిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.












Click it and Unblock the Notifications