ఇలా అయితే రూపాయి గతి ఏంటి? వణికిపోతున్న కరెన్సీ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగుతుండటంతో భారత రూపాయిపై ఒత్తిడి మరింత తీవ్రమైంది. చమురు దిగుమతుల కోసం డాలర్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే రూ. 95.22 స్థాయికి దిగజారింది. ఆయిల్ అవసరాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ ఇలాంటి తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో చమురు కాంట్రాక్ట్ ధర స్వల్పంగా తగ్గి రూ. 9,600 వద్ద నమోదైనప్పటికీ, ఇటీవల నమోదైన రికార్డు స్థాయి రూ. 9,828కి సమీపంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమాసియాలో ఊరట లభించినా..
ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ దేశాల మధ్య ప్రాంతీయ భద్రత, శాంతి పునరుద్ధరణపై ఉన్నత స్థాయి చర్చలు జరిగాయన్న వార్తలతో ముడిచమురు ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. అయితే ఈ ఊరట తాత్కాలికమేనని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల ముగిసిన వెంటనే ఇరాన్‌పై సైనిక చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయంటూ వాషింగ్టన్ నుంచి వస్తున్న రాజకీయ ప్రకటనలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఒకవేళ పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు తీవ్రమై క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటే, అది మనలాంటి ఆసియా దేశాలలో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్‌బీఐ జోక్యంపైనే వ్యాపారుల చూపు!
గత కొన్ని రోజులుగా రూపాయి విలువ ఆగకుండా పతనమవుతుండటంతో, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) త్వరలోనే రంగంలోకి దిగి కరెన్సీని ఆదుకుంటుందని ఆర్థిక మార్కెట్లు బలంగా విశ్వసిస్తున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. డాలర్ మారకం విలువ రూ. 95.30 దాటితే ఆర్‌బీఐ మరింత తీవ్రంగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రూపాయి గనుక ఈ కీలక మద్దతు స్థాయిని దాటి దిగజారితే, త్వలోనే ప్రతి డాలర్‌కు రూ. 96 మార్కు వరకు పడిపోయే ప్రమాదం ఉందని ట్రేడర్లు హెచ్చరిస్తున్నారు.
ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై గ్లోబల్ మార్కెట్ల ఉత్కంఠ!
ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లకు అత్యంత కీలకమైన అంశం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే ద్రవ్యపరపతి విధాన నిర్ణయమే. వచ్చే సమావేశంలో వడ్డీ రేట్లపై ఫెడ్ చైర్మన్ ఇచ్చే ప్రకటన కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడం, ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నప్పటికీ పరిస్థితులు సంక్లిష్టంగా మారడంతో ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని మార్కెట్లు ఉత్కంఠగా గమనిస్తున్నాయి. ప్రస్తుతానికి సాంకేతికంగా రూపాయి కొంత కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ, చమురు భయాలు వీడితేనే రూపాయికి అసలైన స్థిరత్వం లభిస్తుంది.














Click it and Unblock the Notifications
