హాట్ కేక్ లా జియో ఐపీఓ: అరగంటలోనే ఫుల్లీ బుక్డ్: స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్
దేశీయ ఈక్విటీ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ప్లాట్ఫార్మ్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఓపెన్ అయింది. బిడ్డింగ్ ప్రక్రియ మొదలైన అతికొద్ది నిమిషాల్లోనే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగం మొత్తం కూడా ఫుల్ అయింది. సబ్ స్క్రిప్షన్ కోసం జారీ చేసిన ఇష్యూల కంటే కూడా రెండింతులు అధికంగా బిడ్డింగ్స్ దాఖలయ్యాయి.. క్యూఐబీ పోర్షన్ నుంచి. అవన్నీ కూడా హాట్ కేక్ లా బుక్ అయ్యాయి. సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి ప్రారంభంలోనే అపూర్వ స్పందన లభించింది.
ఇష్యూ ప్రారంభమైన 28 నిమిషాల్లోనే క్యూఐబీ కోటా 1.95 రెట్లు పూర్తయిందంటే దీనికి ఉన్న డిమాండ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే.. అంటే అక్టోబర్ 19న నిర్వహించిన యాంకర్ బుక్ వేలం ద్వారా జియో ప్లాట్ఫార్మ్స్ రూ.8,109.84 కోట్ల భారీ నిధులను సమీకరించింది. బ్లాక్రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ, జిఐసి, నార్జెస్ బ్యాంక్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన 212 దిగ్గజ సంస్థాగత మదుపరులు ఇందులో పాల్గొన్నారు.

యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు రావడం భారత ఐపీఓ చరిత్రలోనే ఒక నూతన రికార్డుగా నిలిచింది. ఈ ఐపీఓ ద్వారా జియో ప్లాట్ఫార్మ్స్ కంపెనీ దాదాపు 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఒక్కో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.1,065 నుంచి రూ.1,119. ప్రధాన ఇష్యూతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అర్హులైన వాటాదారులకు రూ.2,500 కోట్లు, అలాగే కంపెనీ ఉద్యోగులకు రూ.500 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు.
ఉద్యోగులకు నిర్ణయించిన తుది ఆఫర్ ధరపై షేరుకు రూ.54 వరకు డిస్కౌంట్ లభించనుంది. సాధారణ మదుపరుల కోసం ఈ పబ్లిక్ ఆఫర్ అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉంటుంది. అలాట్మెంట్ ప్రక్రియను 26 నాటికి పూర్తి అవుతుంది. 28న బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలలో షేర్లు లిస్ట్ కానున్నాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్ లో జియో ప్లాట్ఫార్మ్స్ షేర్లకు దాదాపు 22 నుంచి 23 శాతం వరకు ప్రీమియం లభిస్తోంది. ఒక్కో షేర్ మీద రూ. 260 నుంచి రూ. 277 వరకు లాభాలతో లిస్ట్ అవ్వొచ్చని జీఎంపీ అంచనాలు ఉన్నాయి.
దీన్ని బట్టి చూస్తే. లిస్టింగ్ లోనే ఇన్వెస్టర్లకు మెరుగైన లాభాలను అందించడం ఖాయంగా కనిపిస్తోంది. మోతీలాల్ ఓస్వాల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, ఎం కే గ్లోబల్, ఎస్బీఐ క్యాప్స్ వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ ఐపీఓకు సబ్స్క్రైబ్ సిఫార్సును ఇచ్చాయి. టెలికాం, డిజిటల్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం, 53.3 కోట్లకు పైగా ఉన్న యూజర్లు, 5జీ నెట్వర్క్..జియో ప్లాట్ ఫామ్స్ కు ప్రధాన బలం.
ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను ప్రధానంగా తమ టెలికాం అనుబంధ సంస్థకు ఉన్న పాత రుణాలను చెల్లించడానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. ఐపీఓ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జియో ప్లాట్ఫార్మ్స్లో అత్యధిక మెజారిటీ వాటాను నిలబెట్టుకోనుంది.















Click it and Unblock the Notifications
