పిల్లల ప్రసంగం వింటూ కంటతడి పెట్టిన ముకేష్ అంబానీ
జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ లిస్టింగ్ సందర్భంగా ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ లో జరిగిన వేడుకలో భావోద్వేగ ఘట్టాలు ఆవిష్కృతం అయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన పిల్లల ప్రసంగాలు వింటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ దశలో కంటతడి పెట్టారు. రిలయన్స్ 0వ్యాపార ప్రయాణం, కుటుంబ వారసత్వం, జియో ఐపీఓకు లభించిన మద్దతు గురించి ఈషా అంబానీ, అనంత్ అంబానీ మాట్లాడిన తీరు అక్కడున్న ప్రతినిధులను ఆకట్టుకుంది.
మొదట రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ మాట్లాడారు. 1977లో ధీరూభాయ్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఆఫరింగ్‌కు వచ్చినప్పుడు ముకేశ్ అంబానీ వయసు 20 సంవత్సరాలేనని గుర్తు చేశారు. తండ్రి చూపిన బాటలోనే నేడు జియో కూడా ప్రజాదరణ పొందిందని, ఇది తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. రికార్డుస్థాయిలో బిడ్డింగ్స్ దాఖలయ్యాయని పేర్కొన్నారు.

దశాబ్ద కాలంలో జియో డిజిటల్ రంగంలో సాధించిన ఆర్థిక పురోగతిని ఈషా అంబానీ ఈ సందర్భంగా వివరించారు. ఈ ఏడాది జియో వ్యాపార లావాదేవీల ద్వారా దాదాపు 15.5 బిలియన్ డాలర్ల రాబడిని సాధించామని అన్నారు. ఎనిమిది బిలియన్ డాలర్ల నికర లాభాన్ని సంస్థ ఆర్జించిందని తెలిపారు. ఈ విజయం గణాంకాలకు మాత్రమే పరిమితం కావట్లేదని, కోట్లాది మంది యూజర్లు జియోను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఐపీఓ కోసం రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ పడిన శ్రమను ఈషా ప్రస్తావించారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. గత 13 ఏళ్లుగా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ను బలోపేతం చేయడంలో ఆకాశ్ అహరహం కృషి చేశారని, అర్ధరాత్రి దాటిన తర్వాతే చాలా రోజులు ఇంటికి వచ్చేవారని వెల్లడించారు. ఆయన నిబద్ధత పట్ల ఓ సోదరిగా ఎంతో గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు. జుగ్ జుగ్ జియో అంటూ పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదంలోనే పదాలనే ఈ సంస్థకు పెట్టినట్లు పేర్కొన్నారు.
అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రసంగించారు. తమ సంస్థపై నమ్మకం ఉంచిన మిలియన్ల మంది ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. లిస్టింగ్ సమయంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సంప్రదాయబద్ధంగా మోగించిన గంట శబ్దం.. తనకు ఆలయ గంటలా వినిపించిందని వ్యాఖ్యానించారు. తమకు వ్యాపారం అనేది ఒక పూజ లాంటిదని, పూజ ముగిశాక లభించే ప్రసాదాన్ని అందరికీ పంచినట్లే, జియో సాధించిన ఫలితాలు, ప్రయోజనాలను దేశ ప్రజలతో పంచుకుంటున్నామని అన్నారు.
తాము ముగ్గురం సోదరులమైనప్పటికీ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అనంత్ వివరించారు. తమ శరీరాలు మాత్రమే వేరుగా ఉన్నాయని, ఒకే ఆత్మగా పనిచేస్తోన్నామని అనంత్ చెప్పారు. తాతయ్య ధీరూభాయ్ అంబానీ కలలు, బామ్మ ఆశీస్సులు, తండ్రి ముకేశ్ అంబానీ మార్గదర్శకత్వం, తల్లి నీతా అంబానీ ఇచ్చిన సంస్కారాలే రిలయన్స్ సంస్థను నిరంతరం నడిపిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. అనంత్ అంబానీ ప్రసంగం వింటూ ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టడం కనిపించింది.













Click it and Unblock the Notifications
