రూ. 17,500 కోట్లతో అనంతపురంలో కియా భారీ విస్తరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సీఐఐ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పలు పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటోంది ఏపీ ప్రభుత్వం.
ఈ క్రమంలో.. పారిశ్రామిక రంగానికి మరింత ఊపునిస్తూ దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా మరో భారీ పెట్టుబడి ప్రకటింది. తన తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంలో భాగంగా అదనంగా మరో రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు 17,500 కోట్ల రూపాయలు. ఈ విస్తరణతో అనంతపురం ప్లాంట్ సామర్థ్యం రెట్టింపు కానుండటంతో పాటు, రాష్ట్రంలో వేలాది మంది యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

విశాఖపట్నంలో నిర్వహించిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గ్వాంగు లీ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం అనంతపురం యూనిట్‌లో ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు లక్షల నుంచి ఏకంగా 6.2 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు తెలిపారు. ఈ విస్తరణ ద్వారా ప్రత్యక్షంగా 3,000 అదనపు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.
రాష్ట్రంలో కియా ప్రయాణం 2017లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో కొనసాగింది. 2019లో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతపురం ప్లాంట్.. ప్రస్తుతం కియాకు అంతర్జాతీయ ఎగుమతి కేంద్రంగా మారింది. అప్పటి నుంచి పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని గ్వాంగు లీ పేర్కొన్నారు. ఈ నూతన పెట్టుబడితో అత్యాధునిక వాహన మోడళ్లు, కొత్త పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని భారతీయ మార్కెట్ లోకి తీసుకుని రానున్నట్లు చెప్పారు.
స్థానిక సప్లై చైన్‌ను మరింత బలోపేతం చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన హ్వాషిన్, సెయోన్, ఇవామెట్ అనే మూడు ప్రధాన విడిభాగాల తయారీ సంస్థలు సైతం అనంతపురంలో 1,614 కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. దీని ద్వారా మరో 1,400 మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి.
అనంతపురం కియా ప్లాంట్ నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు పైగా 1.1 లక్షల వాహనాలను ఎగుమతి చేస్తున్నారు. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోనూ ఈ కొరియన్ ఆటోమొబైల్ జెయింట్ వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 33,462 యూనిట్ల విక్రయాలతో అత్యధిక నెలవారీ రికార్డును నమోదు చేసింది. అలాగే జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో 2.86 లక్షల యూనిట్ల విక్రయాలను అందుకుంది.














Click it and Unblock the Notifications
