UPI Payments: ఉన్నపళంగా పాస్ అయిన టాక్స్ బిల్లు! పన్నుల్లో భారీ మార్పులు
లోక్‌సభలో గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆందోళనలు, పోలీసుల చర్యలపై ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ సభామధ్యంలోకి వచ్చి నినాదాలతో హోరెత్తించారు. ఈ హంగామా, రగడ మధ్యలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026'ను పరిశీలన కోసం సభ ముందుకు తెచ్చారు.
విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండగానే, ఎటువంటి చర్చ లేకుండానే ఈ కీలక సవరణ బిల్లుకు లోక్‌సభ నోటిమాట ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ బిల్లు ద్వారా 'ఇన్కమ్ టాక్స్ యాక్ట్ 2025' తో పాటు 'ఫైనాన్స్ యాక్ట్ 2026', యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే 'పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007' లలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురాబోతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక పరిస్థితులు, అంతర్జాతీయ వ్యాపార వర్తక రంగాల్లో తలెత్తుతున్న ఒడిదొడుకుల ప్రభావం మన దేశంపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. అంతర్జాతీయంగా ఎంతటి ఆర్థిక షాక్‌లు ఎదురైనా తట్టుకుని నిలబడేలా స్వదేశీ రంగాన్ని బలపరచడం, పన్ను విధానాల్లో స్పష్టత తెచ్చి వ్యాపారులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాతావరణాన్ని కల్పించడమే ఈ కొత్త చట్టం ప్రధాన లక్ష్యం. ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు సంపూర్ణ చట్టరూపంలో ఈ బిల్లు అమల్లోకి రానుంది.

ఎలక్ట్రానిక్స్, డైమండ్ రంగానికి బంపర్ ఆఫర్స్!
దేశీయంగా తయారీ రంగాన్ని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రంగాన్ని విస్తరించేందుకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. మనదేశంలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, సర్వర్లు, వేరబుల్ గ్యాడ్జెట్లు తయారు చేసే కంపెనీలకు విదేశీ సంస్థల నుంచి అందే యంత్రాలు, మూలధనంపై ఇచ్చే పన్ను మినహాయింపు గడువును ఏకంగా 2041 మార్చి వరకు పొడిగించారు. అంటే మరో 15 ఏళ్ల పాటు ఈ రాయితీలు కొనసాగుతాయి. దాంతో పాటు అంతర్జాతీయ వజ్రాల వ్యాపారంలో భారత్ నంబర్ వన్‌గా నిలిచేందుకు ప్రత్యేక జోన్ల ద్వారా ముడి వజ్రాలను విక్రయించే విదేశీ డైమండ్ సంస్థలకు కూడా 2041 వరకు పన్ను మినహాయింపులు ఇస్తూ పక్కా ప్రణాళిక వేశారు.
విదేశీ ఇన్వెస్టర్లు, డిజిటల్ పేమెంట్లకు పెద్దపీట
విదేశీ ఇన్వెస్టర్లను మన ప్రభుత్వ బాండ్ల వైపు ఆకర్షించేందుకు గానూ ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIs) ప్రభుత్వం సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల ద్వారా వచ్చే వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్ వ్యాపారాలపై సడలింపులు ప్రకటించారు. అంతేకాకుండా సామాన్యులకు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ చట్టంలో తెచ్చిన మార్పుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం సూచించే డిజిటల్, ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై బ్యాంకులు గానీ, ఏజెన్సీలు గానీ ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేకుండా సర్కార్ ఈ బిల్లులో స్పష్టమైన అధికారాలను చేజిక్కించుకుంది.




Click it and Unblock the Notifications