బంగారం ధరలను భారీగా దెబ్బ కొడుతున్న ఈ అంశాలు
పసిడి ప్రియులకు గత కొంతకాలంగా భారీ ఊరట లభిస్తోంది. శుక్రవారం నాటి కమొడిటీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా పతనం అయ్యాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో పసిడి ధర రికార్డు గరిష్ట స్థాయిల నుండి ఏకంగా రూ. 6,000 వరకు పడిపోగా, వెండి ధర కూడా రూ. 10,000 మేర క్షీణించింది. ఈ భారీ పతనం మార్కెట్ అంచనాలకు అందట్లేదు. ఎంత పెరిగిందో.. అంతకు రెట్టింపు తగ్గడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నపళంగా ఈ భారీ పతనానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాలు, విధానపరమైన అంచనాలే కీలక కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తోన్నారు. రానున్న రోజుల్లో కూడా వడ్డీ రేట్లను భారీగా పెంచే అవకాశం ఉందనే బలమైన సంకేతాలు ఇచ్చారు.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధి కెవిన్ వార్ష్. భవిష్యత్ లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఏకంగా రెండు శాతం మేర పెంచే అవకాశం ఉందనే ప్రచారంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం పెట్టుబడుల నుండి లాభాలను స్వీకరించడం మొదలుపెట్టారు. వాటిని ఇతర సురక్షిత మార్గాల వైపు మళ్లించడానికి మొగ్గు చూపారు. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఒక్కసారిగా 3.43 శాతం మేర క్షీణించి, ఔన్స్‌కు 4,504.10 డాలర్ల స్థాయికి ట్రేడ్ అయింది. వెండి ధర కూడా ఇదే విధంగా తీవ్ర పతనాన్ని చవిచూసింది.
అంతర్జాతీయ మార్కెట్ లో వెండి ధర 4.57 శాతం నష్టపోవడాన్ని అసాధారణంగా పరిగణిస్తోన్నారు. వెండి ఔన్స్‌కు 66.255 డాలర్ల వద్ద ముగియడంతో దేశీయ మార్కెట్లలోనూ పతనం తప్పలేదు. ఈ అకస్మాత్తు పరిణామాలతో సాధారణ ఆభరణాల కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ, మార్కెట్లో మాత్రం భయాందోళనలు పెరిగాయి. రానున్న రోజుల్లో కూడా ఈ ధరల ఒడిదుడుకులు కొద్దిరోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తోన్నాయి.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరల తగ్గుదల స్పష్టంగా కనిపించింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చుకుంటే శనివారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలో 2,890 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్లల్లో రూ. 2,650, 18 క్యారెట్లల్లో రూ. 2,170 మేర పడిపోయాయి. మొన్నటివరకు 1.65 లక్ష రూపాయల వరకూ వెళ్లిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 1.58 లక్షలకు దిగొచ్చింది. వెండి ధరలో కూడా ఇదే పరిణామం చోటు చేసుకుంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,58,240 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,45,050గా రికార్డయింది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,58,240 కాగా 22 క్యారెట్లు రూ. 1,45,050 వద్ద నిలిచింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,58,240 పలకగా.. 22 క్యారెట్లు రూ. 1,45,050 వద్ద స్థిరపడింది. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,58,240, 22 క్యారెట్లు రూ. 1,45,050 వద్ద ట్రేడ్ అయింది.














Click it and Unblock the Notifications