Paternity Leave: మగవారికి కూడా సెలవులు! ప్రైవేట్ జాబ్స్ లో సైతం చైల్డ్ కేర్ లీవ్స్!
కుటుంబ వ్యవస్థ, పిల్లల పెంపకంలో శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ విధానాలకు స్వస్తి పలికి, వర్కింగ్ పేరెంట్స్ జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తేసేందుకు జాతీయ మహిళా కమిషన్ నడుం బిగించింది. ఇప్పటివరకు కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన చైల్డ్ కేర్ సెలవులను ఇకపై పురుషులకు కూడా వర్తింపజేస్తూ 'జెండర్ న్యూట్రల్'గా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదనలు సమర్పించింది.
సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT), మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖలకు ఈ కీలక సిఫార్సుల నివేదికను అందించింది. పిల్లల సంరక్షణ అనేది కేవలం తల్లి బాధ్యతే కాదని, తండ్రికి కూడా సమాన భాగస్వామ్యం ఉందనే దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

730 రోజుల సెలవుల్లో తండ్రికీ సగం వాటా!
ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో మహిళా ఉద్యోగులకు అందుబాటులో ఉన్న 730 రోజుల చైల్డ్ కేర్ సెలవుల నిబంధనలో మహిళా కమిషన్ సంచలన మార్పులను సూచించింది. ఇకపై ఈ 730 రోజుల వ్యవధిని తల్లిదండ్రులిద్దరికీ చెరిసగం (చెరో 365 రోజులు) పంచాలని ప్రతిపాదించింది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఒకే సంస్థలో పనిచేస్తుంటే, వారిద్దరూ కలిసి వాడుకునేలా ఒక కామన్ పూల్ విధానాన్ని రూపొందించాలని పేర్కొంది.
అంతేకాకుండా, పుట్టిన సమయం నుంచి రెండేళ్ల వయసున్న పసిబిడ్డల పెంపకంలో ప్రధాన రక్షకులుగా ఉండే తల్లి, ద్వితీయ రక్షకుడైన తండ్రి మధ్య 60:40 నిష్పత్తిలో సంరక్షణా బాధ్యతలను పంచేలా సరికొత్త 'షేర్డ్ కేర్ మోడల్'ను తెరపైకి తెచ్చింది.
ప్రైవేట్, గిగ్ వర్కర్లకూ ప్రసూతి ప్రయోజనాలు
కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగానికి కూడా జెండర్ న్యూట్రల్ సెలవులతో పాటు వేతనంతో కూడిన పితృత్వ సెలవులను (Paid Paternity Leave) తప్పనిసరి చేయాలని కమిషన్ కోరింది. దేశంలో దాదాపు 90 శాతానికి పైగా శ్రామిక మహిళలు అసంఘటిత రంగం, గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లుగానే ఉన్నారని, వారందరికీ సరైన ప్రసూతి లబ్ధి అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
అందువల్ల ఈ సూచనలను చట్టబద్ధం చేస్తూ అసంఘటిత మహిళా శ్రామికులందరికీ వర్తింపజేయాలని స్పష్టం చేసింది. దీనికి తోడు 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన' పథకాన్ని ప్రతి ఒక్కరికీ చట్టబద్ధమైన హక్కుగా మార్చాలని సూచించింది.
దత్తత తల్లులకు 26 వారాల సెలవులు.. 2026 నాటికి 5 లక్షల క్రెచ్‌లు!
సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సొంతంగా పిల్లలను కనిన తల్లులతో పాటు, దత్తత తీసుకున్న తల్లులకు, సరోగసి ద్వారా పిల్లలను పొందిన తల్లులకు కూడా సమాన ప్రసూతి హక్కులు కల్పించాలని కమిషన్ డిమాండ్ చేసింది.
ప్రస్తుతం దత్తత తల్లులకు ఇస్తున్న 12 వారాల సెలవును ఏకంగా 26 వారాలకు పెంచాలని సిఫార్సు చేసింది. పనిచేసే మహిళలకు అండగా నిలిచేందుకు 2030 నాటికి దేశ వ్యాప్తంగా శిశు సంరక్షణా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రానికి సమర్పించిన సమగ్ర నివేదికలో స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
