AI: కొంపలేమీ మునగవు! వినాశనానికి ఛాన్స్ లేదు: Nvidia CEO
ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని గ్లోబల్ టెక్ దిగ్గజం, ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ తెగేసి చెప్పారు. రాబోయే రోజుల్లో ఏఐ ఈ లోకాన్ని సర్వనాశనం చేస్తుందనడం అబద్ధమని, అలాంటి వినాశనం జరగడానికి 'జీరో శాతం' కూడా అవకాశం లేదని ఆయన గట్టిగా స్పష్టం చేశారు. ఇటీవల ఓ అంతర్జాతీయ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భయాందోళనల వెనుక స్వార్థ ప్రయోజనాలు!
2030 నాటికి ఏఐ కారణంగా ప్రపంచం అంతమైపోతుందంటూ అమెరికా వ్యాప్తంగా కొంతమంది భయాన్ని నూరిపోస్తున్నారని హువాంగ్ మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు చేయడం వెనుక ఏదో ఒక స్వార్థ ప్రయోజనం దాగి ఉండి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికో, రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా పెద్ద పెద్ద ఇంటర్వ్యూలలో ప్రచారం పొందేందుకో ఇటువంటి అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏది ఏమైనప్పటికీ, ఏఐ ద్వారా ప్రపంచం నాశనమవుతుందనడంలో ఎలాంటి అర్థం లేదని పునరుద్ఘాటించారు.

సురక్షితమైన మార్గంలో స్పీడ్ పెంచుతాం
ఏఐ భయాల పేరుతో టెక్నాలజీ అభివృద్ధిని ఆపాల్సిన అవసరం లేదని, కాకపోతే అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించడం చాలా ముఖ్యమని హువాంగ్ పేర్కొన్నారు. ప్రాథమికంగా వినియోగానికి సిద్ధంగా లేని, సురక్షితం కాని ఉత్పత్తులను తాము ఎప్పటికీ మార్కెట్లోకి విడుదల చేయబోమని స్పష్టం చేశారు. దేశం ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ఏఐ రంగం వీలైనంత వేగంగా ముందుకు సాగాలని, ఇదే విషయాన్ని అమెరికా ప్రజలతో పాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆకాంక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు.
దిగ్గజాల మధ్య ముదిరిన వాదోపవాదాలు
మరొకవైపు ఏఐ వేగానికి కాస్త బ్రేకులు వేయాలంటూ ప్రసిద్ధ టెక్ సంస్థ 'ఆంత్రోపిక్' సీఈఓ డారియో అమోడీ ఇటీవల రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. మానవ నియంత్రణను దాటి ఏఐ వ్యవస్థలు స్వయంగా అభివృద్ధి చెందే (రైకర్సివ్ సెల్ఫ్-ఇంప్రూవ్‌మెంట్) ప్రమాదం ఉందనేది ఆయన ప్రధాన ఆందోళన. ఈ వైఖరికి మద్దతుగా ఆంత్రోపిక్ సంస్థకు చెందిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం, అలాగే ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మాన్, గూగుల్ డెమిస్ హస్సాబిస్ కూడా జాగ్రత్తలు అవసరమని హెచ్చరించడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. అయితే ఈ హెచ్చరికలన్నింటినీ ఎన్విడియా సీఈఓ కొట్టిపారేస్తూ ఏఐ ప్రయాణం వేగంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
