కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? ఈ 4 తప్పులు చేస్తే పశ్చాత్తాపమే!
Car Buying Tips: కొత్త కారు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటూ ఉంటారు. సొంత సంపాదనతో తమకోసం లేదా తల్లిదండ్రుల కోసం కారు కొనాలని చాలా మంది కలలు కంటారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కారు కొనేటప్పుడు సరైన కారును ఎంచుకోకపోతే ఆ తర్వాత పశ్చాత్తాపం తప్పదు. తొందరపాటులో చేసే చిన్న పొరపాటు కూడా తర్వాత భారీ ఖర్చుకు, నిరాశకు దారితీయవచ్చు. అందుకే కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు మీరు తప్పకుండా పాటించాల్సిన కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. టెస్ట్ డ్రైవ్ చేయకుండా నిర్ణయం తీసుకోవద్దు..
ప్రకటనలు లేదా ఆన్‌లైన్ రివ్యూలు చూసి కారును నచ్చడం సరైన విషయమే. కానీ టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఎప్పుడూ బుకింగ్‌ను ఖరారు చేయవద్దు. షోరూమ్‌లో కారును చూసి లేదా అందులో కూర్చుని కొనే తప్పు అస్సలు చేయకండి. సేల్స్ మ్యాన్‌ను టెస్ట్ డ్రైవ్ అడిగి కారును తీరిగ్గా నడిపి చూడండి. దీని ద్వారా రోడ్డుపై కారు రైడ్ క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది. ఇంజిన్ పికప్, బ్రేకింగ్ లేదా గేర్‌బాక్స్ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. సీటు కంఫర్ట్, డ్రైవింగ్ చేసేటప్పుడు విజిబిలిటీ వంటివి టెస్ట్ డ్రైవ్‌లోనే తెలుస్తాయి. కారులో ఉన్న ఫీచర్ల గురించి తెలుసుకొని, అవి మీ అవసరాలకు సరిపోతాయో లేదో నిర్ధారించుకోండి.

2. కేవలం మైలేజ్‌పైనే దృష్టి పెట్టవద్దు..
భారతీయ వినియోగదారులు తరచుగా మైలేజ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇతర ముఖ్య అంశాలను విస్మరించకూడదు. కేవలం మైలేజ్ సంఖ్యలను చూసి అత్యధిక మైలేజీ ఇచ్చే కారును ఎంచుకోవద్దు. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లలో తరచుగా భద్రతా ఫీచర్లు తక్కువగా ఉండవచ్చు లేదా బిల్డ్ క్వాలిటీ బలహీనంగా ఉండవచ్చు. మైలేజ్‌తో పాటు భద్రత చాలా కీలకం కాబట్టి, కారు సేఫ్టీ రేటింగ్ (NCAP వంటి సంస్థల రేటింగ్)పై కూడా దృష్టి పెట్టాలి. కారు మెయింటెనెన్స్ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
3. అవసరం లేని ఓవర్-ఎక్విప్‌డ్ వేరియంట్‌ను కొనుగోలు చేయొద్దు..
సన్‌రూఫ్ వంటి ఆకర్షణీయంగా కనిపించే ఫీచర్ల కోసం చాలా మంది వాటి అవసరం లేకపోయినా, అత్యంత ఖరీదైన టాప్ వేరియంట్‌ను ఎంచుకుంటారు. నిజానికి ఆ ఫీచర్లు వారికి అవసరం ఉండదు, కేవలం ఆడంబరం కోసం కొంటారు. మీరు ఉపయోగించని ఫీచర్ల కోసం అదనపు డబ్బు చెల్లించడం పెద్ద పొరపాటు అవుతుంది. టాప్-ఎండ్ మోడల్ బేస్ మోడల్ కంటే లక్షల్లో ఎక్కువ ధర ఉంటుంది. కాబట్టి, కారు కొనే ముందు, మీకు నిజంగా ఏ ఫీచర్లు అవసరమో జాబితా చేసుకోండి, కేవలం బాగున్నాయి కదా అని కొనుగోలు చేయకండి.
4. ఒకే డీలర్‌తో మాత్రమే మాట్లాడవద్దు..
చాలా మంది వినియోగదారులు మొదటి డీలర్ ఇచ్చిన ఆఫర్‌నే ఫైనల్ అనుకుంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. వివిధ డీలర్‌ల నుంచి ధరలు, డిస్కౌంట్లు, ఫైనాన్స్ రేట్లను పోల్చి చూడండి. పలువురు డీలర్ల నుంచి కోటేషన్లు తీసుకోవడం ద్వారా మీరు తరచుగా మెరుగైన డీల్‌ను లేదా అదనపు ఫిట్టింగ్స్ ను ఉచితంగా పొందవచ్చు.












Click it and Unblock the Notifications