పెట్రోల్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్?
దేశంలో వాహనదారులకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందడి ముగిసి ఫలితాల లెక్కింపు జరుగుతున్న వేళ, సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2022 ఏప్రిల్ నుంచి దాదాపు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా, దేశీయంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రేట్లను పెంచకుండా కట్టడి చేశాయి. అయితే, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు ఏకంగా $108కి చేరుకుంది. దీంతో ఈ భారాన్ని ఇకపై భరించడం తమ వల్ల కాదని చమురు సంస్థలు మొత్తుకుంటున్నాయి.
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించిన లెక్కల ప్రకారం.. ముడి చమురు ధరలు పెరిగినా రిటైల్ ధరలు మార్చకపోవడం వల్ల కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 24, డీజిల్‌పై రూ. 30 వరకు నష్టపోతున్నాయి. ప్రస్తుతం ఈ నష్టాలు కొంత తగ్గినప్పటికీ, ఇంకా ప్రతికూల మార్జిన్లే కనిపిస్తున్నాయి. ముడి చమురు కొనుగోలుకు అయ్యే ఖర్చు, దాన్ని శుద్ధి చేసి అమ్మే ధరల మధ్య వ్యత్యాసం పెరిగిపోవడంతో ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నాయి.

ప్రభుత్వం ఏమంటోంది?
"సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పుడు ధరలను ఎప్పుడూ ఒకే దగ్గర ఉంచలేం. ఏదో ఒక సమయంలో మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేయాల్సిందే" అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అయితే చమురు సంస్థలు చెబుతున్నంత భారీ స్థాయిలో నష్టాలు లేవని, 'క్రాక్ స్ప్రెడ్' (ముడి చమురు కొన్న ధరకూ - రిఫైన్ చేసి అమ్మిన ధరకూ మధ్య ఉండే లాభం) ద్వారా అవి లాభాలు కూడా ఆర్జిస్తున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కానీ, ఎక్సైజ్ సుంకాన్ని గతంలో లీటరుకు రూ. 10 తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 1.7 లక్షల కోట్ల ఆదాయం తగ్గింది. దీంతో ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి ధరల పెంపు అనివార్యమని తెలుస్తోంది. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 2 నుంచి రూ. 4 వరకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సంకేతాలిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం భయం..
కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు కూడా రెట్టింపయ్యాయి. యూరియా ధరలు పెరగడం వల్ల వ్యవసాయ రంగంపై భారం పడుతోంది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం ఆర్థిక, పెట్రోలియం శాఖల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తగ్గిన వెంటనే ధరల పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు ఇలాగే కొనసాగితే, మరికొన్ని రోజుల్లో వాహనదారులకు ఇంధన భారం తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications