కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ముహూర్తం- సీఎం డీకే శివకుమార్ టీమ్ లో వీళ్లకే చోటు
కర్ణాటకలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 3వ తేదీన సోమవారం సాయంత్రం 4 గంటలకు నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటుకానుంది. ఈ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం తుది ఆమోదం తెలపడంతో.. బెంగళూరు రాజ్‌భవన్‌లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధికారులను సైతం ఆదేశించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం డీకే శివకుమార్ కేబినెట్ లో 20 మంత్రి పదవులు ఖాళీగా ఉంటోన్నాయి. వాటిల్లో 18 స్థానాలను ఈ విడతలోనే భర్తీ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ వేర్వేరుగా పంపిన మంత్రుల జాబితాలను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించింది. తుది జాబితాకు ఓ రూపాన్ని ఇచ్చింది. ఆదివారం నాటికి ఈ ఫైనల్ లిస్ట్ ముఖ్యమంత్రి చేతికి చేరుతుందని అంటున్నారు.

వివిధ సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను సమతుల్యం చేస్తూ ఈసారి కేబినెట్ కూర్పు ఉండబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన దావణగెరె ఎమ్మెల్యే ఎస్ఎస్ మల్లికార్జున్, వక్కలిగ వర్గానికి చెందిన నాగమంగళ ఎమ్మెల్యే ఎన్ చలువరాయస్వామి, హోస్కోటెకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శరత్ బచ్చెగౌడ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి.
వీరితో పాటు బీసీలు, దళిత సామాజిక వర్గం నుంచి ఆనేకల్ ఎమ్మెల్యే శివన్న, దళిత లెఫ్ట్ వర్గానికి చెందిన కేఎస్ బసవంతప్పలకు ఈ విస్తరణలో చోటు దక్కనున్నట్లు సమాచారం. అలాగే కంప్లి నియోజకవర్గ ఎస్టీ ఎమ్మెల్యే జేఎన్ గణేష్, హవేరి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రుద్రప్ప లమాని, విరాజ్‌పేట ఎమ్మెల్యే ఎఎస్ పొన్నన్న, సాగర నియోజకవర్గానికి చెందిన బేలూరు గోపాలకృష్ణ పేర్లు కూడా ఈ తుది జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.
కురుబ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివన్నవర్, మరాఠా కోటాలో హణగల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మానే, భట్కల్ కు చెందిన మొగవీర సామాజిక వర్గ నేత మంకాళ్ వైద్య కూడా ఈ కొత్త కేబినెట్ విస్తరణలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న సుమారు ఆరుమంది నేతలకు కూడా ఈ కొత్త కూర్పులో మళ్లీ అవకాశం కల్పించనున్నారు.
మాజీ మంత్రి, చామరాజపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కు మంత్రివర్గంలో చోటు ఇప్పుడు పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దావణగెరె ఉప ఎన్నికల సమయంలో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన ఇప్పటికే హైకమాండ్ కు క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కుతుందా లేదా అనేది ఆదివారం తేలనుంది.
మంత్రి పదవుల కోసం ఆశావహుల లాబీయింగ్ జోరందుకుంది. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే అప్పాజీగౌడ.. తాజాగా ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. మంత్రి పదవి దక్కించుకునేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన వెంటనే మంత్రులకు నూతన శాఖల కేటాయింపులపై కూడా స్పష్టత రానుంది.














Click it and Unblock the Notifications