రిక్షాడ్రైవర్‌గా మారిన యువరాజు.. రైడ్ ఎంజాయ్ చేసిన యువరాణి
బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ముంబైలో జరుగుతున్న పర్యటనలో భాగంగా ఈ రాయల్ కపుల్ అరుదైన అనుభూతిని సొంతం చేసుకున్నారు. సాధారణంగా ఖరీదైన కార్లలో తిరిగే ఈ జంట, ముంబై వీధుల్లో ఏకంగా ఎలక్ట్రిక్ రిక్షా ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాంద్రా-వర్లీ సీ లింక్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రిన్స్ విలియమ్ స్వయంగా ఆ ఈ-రిక్షాను నడుపుతుంటే, కేట్ మిడిల్టన్ వెనుక సీట్లో కూర్చుని ఆ రైడ్‌ను ఎంతో ఆనందించారు. పర్యావరణ పరిరక్షణను చాటేలా భారత్‌కు చెందిన ప్రముఖ సంస్థ తయారు చేసిన ఈ-రిక్షాలో వారు ప్రయాణించడం విశేషం.
ముంబైలోని బాంద్రా రిక్రియేషన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2026 ఎర్త్‌షాట్ ప్రైజ్ ఫైనలిస్టులైన 15 మందిని రాయల్ కపుల్ కలిశారు. పర్యావరణ మార్పులకు పరిష్కారాలు చూపుతున్న ఆ ప్రతిభావంతులతో విలియమ్, కేట్ ముచ్చటించారు. ఇక ఈ వేడుకలో వీరిద్దరి ఫ్యాషన్ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేట్ మిడిల్టన్ ఎలైట్ ఐవరీ-వైట్ ప్యాంట్‌సూట్‌లో అత్యంత అందంగా కనిపించగా, ప్రిన్స్ విలియమ్ లైట్-బ్లూ పిన్‌స్ట్రైప్డ్ బ్లేజర్, డార్క్ ట్రౌజర్స్‌లో చాలా స్టైలిష్‌గా, సింపుల్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.

గల్లీ క్రికెట్ నుంచి మెట్రో జర్నీ వరకు బిజీ బిజీ
భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రాజ దంపతులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. పర్యటనలో మొదటి రోజు సచిన్ టెండూల్కర్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడటం, కుల్హాడ్ చాయ్ ఆస్వాదించడం, ముంబై మెట్రోలో ప్రయాణించడం వంటి అనుభవాలతో వారు ముంబై ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నారు. ముఖ్యంగా కేట్ మిడిల్టన్ తాను గతంలో వేసుకున్న డ్రెస్సులనే రిపీట్ చేయడం ద్వారా 'సస్టైనబిలిటీ' సందేశాన్ని చాటిచెప్పారు. అలాగే ప్రిన్స్ విలియమ్ కూడా పశ్చిమ బెంగాల్ చేనేత కార్మికులు తయారు చేసిన డీప్-బ్లూ నెహ్రూ జాకెట్‌ను ధరించి మన సంప్రదాయాన్ని గౌరవించారు.
న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీతో ముగియనున్న భారత పర్యటన
ప్రిన్స్ విలియమ్ 2020లో స్థాపించిన 'ఎర్త్‌షాట్ ప్రైజ్' ఆరవ వార్షిక సదస్సులో పాల్గొనేందుకే ఈ రాయల్ కపుల్ భారత్‌కు విచ్చేశారు. పర్యావరణ ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ మూడ్రోజుల పర్యటన తుది అంకానికి చేరుకుంది. ముంబై పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఈ రాజ దంపతులు, రేపు న్యూఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ భేటీతో వారి భారత్ పర్యటన ముగియనుంది.














Click it and Unblock the Notifications
