రూపాయి కోసం డాలర్ విండో ఓపెన్ చేసిన ఆర్బీఐ.. సోమవారం నుంచే అమలు
దేశంలో డాలర్లకు అతిపెద్ద డిమాండ్ సృష్టించేది చమురు దిగుమతులే. ఈ డిమాండ్‌ను సాధారణ ఫారెక్స్ మార్కెట్ నుంచి వేరు చేసేందుకు ఆర్‌బీఐ ఒక ప్రత్యేక విండోను అందుబాటులోకి తెచ్చింది. దేశీయ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలైన ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియమ్‌లకు రోజువారీ అవసరమైన డాలర్లను ఆర్‌బీఐ తన విదేశీ మారక నిల్వల నుంచి నేరుగా అందజేస్తుంది. సోమవారం నుంచి అందుబాటులోకి రానున్న ఈ నిర్ణయం వల్ల సాధారణ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్లకు ఉండే భారీ డిమాండ్ ఒక్కసారిగా తగ్గి, రూపాయి క్షీణతకు తక్షణమే అడ్డుకట్ట పడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
కరెన్సీ మార్కెట్‌లో జరిపే ఊహాజనిత ట్రేడింగ్.. రూపాయి విలువను మరింత దిగజార్చకుండా ఉండేందుకు ఆర్‌బీఐ నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. రూపాయితో కూడిన ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్ పొజిషన్ల పరిమితిని ఏకంగా 100 మిలియన్ డాలర్ల నుంచి కేవలం 5 మిలియన్ డాలర్లకు కుదించింది. అంతేకాకుండా, ఫారెక్స్ డీలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ మారక ద్రవ్య డెరివేటివ్స్‌ను తిరిగి రీబుక్ చేయడానికి అనుమతించకూడదని స్పష్టం చేసింది.

20 శాతం రిస్క్ రిజర్వ్ తప్పనిసరి: కట్టడిలో అంచనాలు
రూపాయితో జరిగే ప్రతి డెరివేటివ్ కాంట్రాక్ట్‌కు సంబంధించి ఆ లావాదేవీ మొత్తం విలువలో 20 శాతానికి సమానమైన మొత్తాన్ని "ఫారెక్స్ రిస్క్ రిజర్వ్" రూపంలో నిర్వహించాలని ఆర్‌బీఐ ఫారెక్స్ డీలర్లను ఆదేశించింది. గతంలో కూడా ఆర్‌బీఐ పలుమార్లు డాలర్లను విక్రయించడం, వడ్డీ రేట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ రూపాయిపై ఒత్తిడి కొనసాగుతూనే వచ్చింది. అయితే తాజా చర్యల సంకేతాలతో శనివారం నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్ మార్కెట్‌లో వన్-మంత్ డాలర్/రూపాయి కాంట్రాక్ట్ దాదాపు 40 పైసలు తగ్గి, రూపాయి కోలుకునే సంకేతాలను చూపించింది.
విదేశీ మారక నిల్వలపై ప్రభావం: మారనున్న మార్కెట్ సమీకరణాలు
ఫారెక్స్ మార్కెట్ నుంచి చమురు సంస్థల డాలర్ అవసరాలను వేరు చేయడం వల్ల మార్కెట్లో అస్థిరత తగ్గి రూపాయికి తాత్కాలికంగా పెద్ద ఊరట లభిస్తుంది. కానీ, చమురు సంస్థలకు నేరుగా డాలర్లను అందించడం వల్ల ఆర్‌బీఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, రూపాయి రికార్డు పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్‌బీఐ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైనదిగా మారనుంది.














Click it and Unblock the Notifications
