రూపాయికి నవరాత్రి పూనకాలు.. ఒక్క వారంలోనే సుడి తిరిగింది
దసరా నవరాత్రుల వేళ రూపాయికి పూనకాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ పై ఉగ్రరూపం చూపించింది. గత కొన్ని నెలలుగా భారతీయ కరెన్సీ రూపాయి విలువ పడిపోతూ ఆందోళన కలిగించగా.. ఇప్పుడు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న పకడ్బందీ చర్యలు సత్ఫలితాలనిస్తుండటంతో గత ఏడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా రూపాయి ఒక్కవారంలోనే ఏకంగా 1.9 శాతం మేర బలపడింది. గడచిన 38 రోజుల్లో తొలిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95 మార్కు దిగువకు చేరింది. అక్టోబర్ 17 నాటికి డాలర్‌తో రూపాయి విలువ రూ.94.71 వద్ద ముగిసింది. అంతకుముందు వారంలో ఇది రూ.96.73గా ఉండేది. అయితే ముడిచమురు ధరలు గరిష్టంగా ఉన్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో ఈ రికవరీ చోటుచేసుకోవడం విశేషం.
ఆర్బీఐ బహుముఖ వ్యూహం.. మార్కెట్‌పై కేంద్ర బ్యాంక్ పట్టు
రూపాయి విలువను కాపాడుకునేందుకు ఆర్బీఐ కేవలం ఒక్క మార్గాన్నే నమ్ముకోకుండా అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. స్పాట్, ఫార్వర్డ్ మార్కెట్లలో నేరుగా డాలర్లను విక్రయించడం, కరెన్సీ మార్కెట్లో స్పెక్యులేటివ్ లావాదేవీలను నిరుత్సాహపరచడం, దిగుమతుల ద్వారా పెరిగే డాలర్ డిమాండ్‌ను కట్టడి చేయడం వంటి చర్యలను అమలు చేసింది. కేవలం లాభాపేక్షతో చేసే ట్రేడింగ్‌ను కట్టడి చేసి, నిజమైన వ్యాపార అవసరాలు ఉన్నవారికే విదేశీ మారకద్రవ్యం అందేలా కఠిన నిబంధనలు తెచ్చింది. ఈ సరికొత్త వ్యూహాల వల్ల ఫారెక్స్ మార్కెట్లో అనిశ్చితి తగ్గి కరెన్సీ స్థిరపడేందుకు దోహదపడిందని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త రాధిక రావు విశ్లేషించారు.

2013 నాటి సంక్షోబ్దానికి.. ఇప్పటి పరిస్థితులకు తేడా ఏమిటి?
గతంలో 2013లో రూపాయి విలువ పడిపోయిన సమయానికి, ప్రస్తుత 2026 నాటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పట్లో ద్రవ్యోల్బణం విపరీతంగా ఉండటం, విదేశీ మారకద్రవ్యం నిల్వలు తక్కువగా ఉండటం వల్ల అది అగ్నిప్రమాదంలా మారితే.. ఇప్పుడున్న సవాలు కేవలం డాలర్ బలపడటం, వాణిజ్య సమీకరణాల మార్పు వల్ల మాత్రమే వచ్చిందని చెబుతున్నారు. భారత్ వద్ద ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ గతంతో పోలిస్తే పటిష్టంగా ఉండటంతో ఆర్బీఐకి మార్కెట్‌ను నియంత్రించే శక్తి లభించింది. అక్టోబర్ 9 నాటికి దేశ విదేశీ మారకద్రవ్యం నిల్వలు 726 బిలియన్ డాలర్లకు తగ్గినప్పటికీ, భవిష్యత్ అవసరాలను ఎదుర్కొనే బఫర్ మన వద్ద ఉందని స్పష్టమవుతోంది.
రూపాయి రికవరీ నిలకడగా ఉంటుందా?
ఆర్బీఐ తీసుకున్న తక్షణ చర్యల వల్ల రూపాయి విలువ కోలుకున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ లాభాలు నిలకడగా ఉండటం అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల తీరు, డాలర్ ఇండెక్స్ దూకుడు, విదేశీ పెట్టుబడుల రాకపోకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులపై సడలింపులు, ఎగుమతిదారులు తమ డాలర్లను స్వదేశానికి రప్పించేలా ప్రోత్సహించే చర్యలను మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికీ తన నిల్వలను ఖాళీ చేయకుండా, నిలకడైన మార్కెట్ పరిస్థితులను కాపాడుకోవడమే ప్రస్తుతం ముందున్న అసలైన సవాలు.














Click it and Unblock the Notifications
