Samsung Layoffs: కొత్త ఆఫీస్ తెరిచిన ఏడాదికే.. ఏఐ తెచ్చిన ముప్పు
ప్రపంచ టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) కీలక నిర్ణయంతో ఒక్కసారిగా ఐటీ రంగంలో కలకలం రేగింది. మొబైల్స్, హోమ్ అప్లయెన్సెస్ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న ఈ దక్షిణ కొరియా కంపెనీ.. అమెరికాలో పనిచేస్తున్న తమ ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి దూసింది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (SEA) తన ప్రధాన కార్యాలయాన్ని (హెడ్‌క్వార్టర్స్) న్యూజెర్సీ నుంచి టెక్సాస్‌కు మారుస్తున్న తరుణంలో ఈ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. హెడ్‌క్వార్టర్స్ షిఫ్టింగ్ ప్రక్రియలో భాగంగా వందలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
న్యూజెర్సీ, టెక్సాస్ ఆఫీసుల్లో లేఆఫ్స్ కలకలం
అధికారిక సమాచారం ప్రకారం.. న్యూజెర్సీలోని ఎంగిల్‌వుడ్ క్లిఫ్స్ కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపు 739 మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలిస్తున్న నేపథ్యంలో.. చాలా మందికి అక్కడికి మారిపోయే (Relocation) ఆప్షన్ ఇచ్చినప్పటికీ, నిరాకరించిన పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. మరోవైపు టెక్సాస్‌లోని ప్లానో మొబైల్ డివిజన్ ఆఫీసులో కూడా దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులకు కంపెనీ పింక్ స్లిప్పులు చేతికి ఇచ్చింది.

ఇందులో సీనియర్ సేల్స్, మార్కెటింగ్ మేనేజర్లు కూడా ఉండటం గమనార్హం. కేవలం ఏడాది క్రితమే న్యూజెర్సీలో ఎంతో ఆర్భాటంగా కొత్త ఆఫీసును ప్రారంభించిన శాంసంగ్.. ఇంతలోనే అక్కడ కార్యకలాపాలు ముగించి టెక్సాస్ బాట పట్టడం గమనార్హం. తక్కువ పన్నులు, వ్యాపార అనుకూల నిబంధనలు ఉండటం వల్లే ఒరాకిల్, టెస్లా తరహాలోనే శాంసంగ్ కూడా టెక్సాస్ వైపు మొగ్గు చూపుతోంది.
ఒకవైపు లాభాల పంట.. మరోవైపు నష్టాల భయం
శాంసంగ్ సంస్థలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని కంపెనీకి చెందిన మైక్రోచిప్ విభాగం రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతోంది. ఈ త్రైమాసికంలో చిప్స్ విభాగంలో లాభాలు ఏకంగా 19 రెట్లు పెరగొచ్చని అంచనా. అయితే, మరోవైపు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ విభాగాలు మాత్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏఐ టెక్నాలజీ వల్ల చిప్స్ తయారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ మార్కెట్‌లో శాంసంగ్‌కు లాభాలు తగ్గిపోతున్నాయి.
అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో యాపిల్ (Apple) నుంచి, టీవీల విభాగంలో చైనాకు చెందిన టీసీఎల్ (TCL), హైసెన్స్ (Hisense) కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ మొబైల్ విభాగం చరిత్రలోనే మొదటిసారిగా నష్టాలను నమోదు చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిప్స్ వైపు ఫోకస్.. ఉద్యోగుల్లో ఆందోళన
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి గ్లోబల్ కంపెనీలన్నీ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెట్టుబడులు పెంచుతూ.. సాధారణ విభాగాల్లో ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. ఇప్పుడు శాంసంగ్ కూడా అదే దారిలో నడుస్తోంది. మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి రాబోయే రోజుల్లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, మొబైల్, అప్లయెన్సెస్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తెచ్చి, మరిన్ని ఉద్యోగాలను తగ్గించవచ్చనే భయాందోళనలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి అంతర్జాతీయంగా ఎలాంటి భారీ పునర్వ్యవస్థీకరణ (Restructuring) ప్రణాళికలు లేవని, కేవలం బిజినెస్ ప్రాధాన్యతలను బ్యాలెన్స్ చేయడానికే ఈ మార్పులు చేస్తున్నామని కంపెనీ యాజమాన్యం సమర్థించుకుంటోంది.












Click it and Unblock the Notifications