Stock Market: దూసుకెళ్లిన నిఫ్టీ, సెన్సెక్స్ .. ఒక్క రోజులో రూ. 8.7 లక్షల కోట్ల లాభం
భారతీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఊహించని విధంగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఒక్క నిర్ణయం దేశీయ మార్కెట్లకు ఊపిరిలూదింది. వివిధ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఆ జాబితా నుండి తొలగిస్తూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ ప్రభావంతో, అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి.
ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ ఒక్కసారిగా దూసుకుపోయింది. ఏకంగా 1500 పాయింట్లకు పైగా లాభపడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక నిఫ్టీ కూడా 500 పాయింట్లు ఎగిసి ట్రేడర్లకు పండగ వాతావరణం కల్పించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో నమోదైన కంపెనీల మొత్తం విలువ ఒక్క రోజులోనే అక్షరాలా రూ. 8.7 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ విలువ రూ. 410.24 లక్షల కోట్లకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 76,852.06 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. క్రితం ముగింపు 75,157.26 పాయింట్లతో పోలిస్తే భారీ పెరిగింది. రోజంతా మార్కెట్ లాభాల బాటలోనే పయనించింది. మధ్యహ్నం సమయానికి 76,907.63 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 1577.63 పాయింట్ల లాభంతో 76,734.89 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే ఊపు కొనసాగించింది. 500 పాయింట్లు లాభపడి 23,328.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ కూడా కాస్త బలపడి 85.77 వద్ద నిలిచింది.
దూసుకెళ్లిన స్టాక్స్
సెన్సెక్స్ 30 సూచీలో దాదాపు అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్ , ఐటీసీ మినహా మిగిలిన స్టాక్స్ అన్నీ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు అద్భుతమైన లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బంగారం ఔన్సు ధర 3,242 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఈ మార్కెట్ జోష్‌కు కారణాలు ఏంటి?
ఈ భారీ లాభాలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న అనూహ్య నిర్ణయమే. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు , ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు తొలగిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం మార్కెట్లలో కొనుగోళ్ల జోరును పెంచింది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది.
ఇక హెచ్‌డీఎఫ్‌సీ , ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా ఈరోజు అద్భుతంగా రాణించాయి. దాదాపు 3 శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్ 1577 పాయింట్లు పెరగడంలో ఈ రెండు బ్యాంకుల వాటానే దాదాపు 638 పాయింట్లు ఉండటం గమనార్హం. బ్యాంకింగ్ రంగం రాణించడంతో మార్కెట్‌కు మరింత బలం చేకూరింది.
ఆటోమొబైల్ రంగం కూడా ఈ ఉత్సాహంలో భాగమైంది. ఆటో సెక్టార్‌కు కూడా టారిఫ్‌ల నుండి మినహాయింపు లభిస్తుందనే అంచనాలతో నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏకంగా 3 శాతం లాభపడింది. సంవర్థనా మదర్‌సన్స్, భారత్ ఫోర్జ్, టాటా మోటార్స్ వంటి కంపెనీల షేర్లు దుమ్మురేపాయి.
నిన్నటి అమెరికా మార్కెట్లతో పాటు నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవ్వడం మన మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. జపాన్, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు లాభాల్లో ముగియడంతో మన ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది.












Click it and Unblock the Notifications