విలయం- అధోః పాతాళానికి షేర్ మార్కెట్
Stock Market Crash: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్.. దేశీయ స్టాక్ మార్కెట్ ప్రళయాన్ని పుట్టించింది. భారీగా నష్టపోయింది. ఇన్వెస్టర్లను వణికిస్తోంది. చుక్కలు చూపెడుతోంది. లాభాలు అనే మాట అటుంచి.. పెట్టిన పెట్టుబడి మొత్తం ఆవిరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తొలి గంటలోనే సెన్సెక్స్, నిఫ్టీ కనీవినీ ఎరుగని విధంగా పతనం అయ్యాయి. సెన్సెక్స్‌లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్‌లో కనిపించాయి. మైనస్‌లల్లో పడిపోయాయి.
దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్ల పరిస్థితీ ఇంతే. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలాగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. తొలి గంటలోనే గరిష్టంగా 3,920 పాయింట్లకు పైగా నష్టపోయింది సెన్సెక్స్. ఆరంభంలోనే స్వల్పంగా కనిపించిన నష్టాల పాయింట్లు.. ట్రేడింగ్ కొనసాగుతున్న స్వల్పంగా తగ్గాయే తప్ప ఆశించిన స్థాయిలో నష్టాన్ని పూడ్చలేకపోయాయి.

సమయం గడుస్తోన్న కొద్దీ షేర్లన్నీ మైనస్‌లోకి వెళ్లిపోవడం కనిపించింది. ఏ దశలో కూడా సెన్సెక్స్ అప్పర్ సర్కుట్‌కు చేరుకోలేకపోయింది. తొలి అరగంట ముగిసే సమయానికి 2,820.46 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. తొలి సెషన్ తరువాత కూడా ఈ క్షీణతకు అడ్డుకట్ట పడకపోవచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.
శుక్రవారం 75,637.44 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ట్రేడింగ్.. నేడు 71,425.01 పాయింట్ల వద్ద ఆరంభమైంది. 3,920 పాయింట్ల నష్టం కనిపించింది. ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ కొద్దికొద్దిగా కోలుకుంది. తొలి అరగంటలో గరిష్టంగా మైనస్ 2,745 పాయింట్ల వద్ద ట్రేడింగ్ రికార్డయింది.
నిఫ్టీ కూడా ఇదేరకమైన పతనాన్ని చవి చూసింది. ప్రారంభంలో ఏకంగా 1,102 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడింగ్ ఆరంభమైంది. ఆ తరువాత కోలుకున్నప్పటికీ- అది నామమాత్రమే. తొలి అరగంటలో మైనస్ 888.55 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. ఒక దశలో గరిష్ఠంగా 21,207 పాయింట్లకు క్షీణించింది. ఆ తరువాత కొద్దిగా కోలుకుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్.. ఇలా అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ రెడ్ జోన్‌లో ట్రేడ్ అయ్యాయి. కన్జ్యూమర్ డ్యూరబల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్స్‌పైనా ప్రభావం పడింది. వాటి షేర్లు రెండు శాతం మేర నష్టపోయాయి.
నిఫ్టీ బ్యాంకింగ్ షేర్లు మాత్రమే కొంతమేర ఫర్వాలేదనిపించుకున్నాయంతే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్ర, భారతి ఎయిర్‌టెల్ వంటి కంపెనీల షేర్లు నష్టపోయాయి. ఆరు శాతం మేర ఆయా కంపెనీల షేర్ల రేట్లు పడిపోయాయి.












Click it and Unblock the Notifications