బంగారంపై కన్నేసిన బడ్జెట్? కొత్త నిబంధనలు రాబోతున్నాయా
భారతీయుడి జీవితంలో బంగారం అంటే కేవలం మెరిసే లోహం కాదు. అది భద్రత, సంప్రదాయం, భావోద్వేగం... అన్నింటి మేళవింపు. పెళ్లిళ్లు, పండుగలు, కష్టకాలం.. ప్రతి సందర్భంలోనూ బంగారం ఒక నమ్మకమైన తోడుగా నిలుస్తుంది. అలాంటి బంగారంపై నేటి బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపబోతోందన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదిలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో సామాన్యుడి ఆశలు, భయాలు రెండూ పెరిగాయి.
బడ్జెట్ చర్చల్లోకి వెళ్లే ముందు చాలా మందికి ఉండే సాధారణ సందేహం ఒక్కటే-ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, మీరు సంపాదించిన బంగారానికి సరైన ఆదాయ ఆధారాలు, బిల్లులు ఉంటే పరిమితి అన్నది లేదు. కానీ ఆధారాలు లేనప్పుడు మాత్రం కొన్ని సడలింపులు ఉన్నాయి. వివాహిత మహిళలు 500 గ్రాముల వరకు, అవివాహిత మహిళలు 250 గ్రాముల వరకు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారం ఉంచుకున్నా ఐటీ తనిఖీల్లో అది జప్తు చేయరు. ఈ నిబంధన చాలామందికి ఊరట కలిగించే అంశమే.

ఇప్పుడు అసలు బడ్జెట్ విషయానికి వస్తే... ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడిదారులు, నగల వ్యాపారులు కొన్ని కీలక మార్పులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం కొంటే పాన్ కార్డు తప్పనిసరి. కానీ నేటి ధరలతో చూస్తే తులంన్నర బంగారం కొన్నా ఆ పరిమితి దాటిపోతోంది. దీంతో ఈ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచాలని వ్యాపార వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలా జరిగితే మధ్యతరగతి కుటుంబాలకు కొనుగోళ్లు కొంత సులభం కావచ్చు.
పన్నుల భారం కూడా మరో కీలక అంశం. బంగారం కొనుగోలుపై ప్రస్తుతం 3 శాతం జీఎస్టీ ఉంది. ఇక పాత నగలను అమ్మి లాభం పొందితే, రెండేళ్లకు మించి ఉంచినట్లయితే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 12.5 శాతం పన్ను, రెండేళ్లలోపు అయితే షార్ట్‌టర్మ్ గెయిన్స్‌గా 20 శాతం వరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఈ రేట్లలో బడ్జెట్ 2026లో ఏమైనా తగ్గింపులు ఉంటాయా? అనే ఆశ మధ్యతరగతి ప్రజల్లో బలంగా ఉంది.
ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..భారతీయ కుటుంబాల వద్ద సుమారు 34,600 టన్నుల బంగారం ఉందని అంచనా. ఇది ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం కంటే ఎక్కువ. అంటే బంగారంపై ప్రభుత్వం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా కోట్లాది కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
అందుకే ఈసారి బడ్జెట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. పన్నుల్లో ఊరట ఇస్తారా? నిబంధనలను సరళీకరిస్తారా? లేక బంగారంపై మరింత నియంత్రణ పెడతారా? అన్నది ఫిబ్రవరి 1న తేలనుంది. ఏదేమైనా, బంగారం భారతీయుడి జీవితంలో ఎంత కీలకమో ఈ బడ్జెట్ చర్చలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications