ఆ దిగ్గజ కంపెనీలో లక్ష ఉద్యోగాలు అవుట్!
ఇటీవల పలు రంగాల్లో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఆటోమొబైల్ రంగంలోనూ లేఆఫ్స్ భారీగా అవుతున్నాయి ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన చరిత్రలోనే భారీ పునర్మిర్మాణ ప్రణాళికకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫోక్స్‌వ్యాగన్ సీఈవో ఆలివర్ బ్లూమ్ దాదాపు లక్ష ఉద్యోగాల కోతతో పాటు జర్మనీలోని నాలుగు ప్రధాన ఉత్పాదక ప్లాంట్లను మూసివేయాలని భావిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనితో పాటు రాబోయే పెట్టుబడులలో కూడా భారీగా కోత విధించనున్నారు. కంపెనీ బోర్డు ఆమోదం కోసం వేచి చూస్తున్న ఈ ప్రతిపాదనల ప్రకారం.. వోక్స్‌వ్యాగన్ తన రాబోయే ఐదేళ్ల పెట్టుబడులలో 15 శాతం కోత పెట్టి, దానిని కేవలం 130 బిలియన్ యూరోలకే పరిమితం చేయనుంది.
చైనా ఈవీ పోటీ.. అమెరికా సుంకాల దెబ్బ!
కంపెనీని మరింత బలోపేతం చేసేందుకు గానూ.. ఫోక్స్‌వ్యాగన్ తన ప్రధాన 'వీడబ్ల్యూ' (VW) ప్యాసింజర్ కార్ బ్రాండ్‌ను, పార్ట్స్ (విడిభాగాలు) వ్యాపారాన్ని విడివిడి స్వతంత్ర సంస్థలుగా మార్చాలని యోచిస్తోంది. ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ సంస్థ అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు, చైనాకు చెందిన ఈవీ తయారీదారుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ, అలాగే ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మారుతున్న తరుణంలో పెరుగుతున్న వ్యయాల కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ ప్రధాన ఆటోమొబైల్ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టాలని, లాభదాయకతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సీఈఓ ఆలివర్ బ్లూమ్ స్పష్టం చేశారు.

మూతపడనున్న ఆడి, ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్లు!
ప్రస్తుతం నడుస్తున్న వెహికల్ ప్రోగ్రామ్‌లు ముగిసిన తర్వాత.. ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన హానోవర్, జ్విక్కావ్, ఎమ్‌డెన్ ప్లాంట్లతో పాటు ఆడికి చెందిన నెకార్సల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని సంస్థ యోచిస్తోంది. ఇప్పుడు ప్రతిపాదించిన ఈ కఠినమైన చర్యలు కంపెనీ గతంలో ప్రకటించిన 50,000 ఉద్యోగాల కోత కంటే చాలా ఎక్కువ. ఇది ఫోక్స్‌వ్యాగన్ గ్లోబల్ ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 15 శాతాన్ని ప్రభావితం చేయనుంది. అయితే ఈ అంతర్గత ప్రణాళికలపై స్పందించడానికి ఫోక్స్‌వ్యాగన్ నిరాకరించింది.
అడ్డుకుంటామంటున్న కార్మిక సంఘాలు!
ఫోక్స్‌వ్యాగన్ యాజమాన్యం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్లను మూసివేయడానికి లేదా అంతకంతకూ ఉద్యోగాల కోతలను పెంచడానికి కంపెనీ చేసే ఎలాంటి ప్రయత్నాలనైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని కంపెనీ వర్క్స్ కౌన్సిల్, ఐజీ మెటల్ యూనియన్లు ప్రతిజ్ఞ చేశాయి. యాజమాన్యం తీసుకోబోయే లేఆఫ్స్ నిర్ణయాలతో ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని, దీనిపై పోరాడతామని కార్మిక సంఘాలు స్పష్టం చేయడంతో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications