Credit Card మార్చితే పెద్ద చిక్కే! ఆటో పేమెంట్స్ ఫెయిల్ అయితే నష్టమే!
కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్లు, ఆటో-డెబిట్ విధానాల వైపే మొగ్గు చూపుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, జిమ్ మెంబర్షిప్, బీమా ప్రీమియంలు, కరెంట్ బిల్లుల వంటి ప్రతినెలా చెల్లించే రకరకాల సబ్స్క్రిప్షన్ల కోసం క్రెడిట్ కార్డులను లింక్ చేయడం సాధారణమైపోయింది. అయితే, మీ క్రెడిట్ కార్డు గడువు ముగియడం వల్లనో, పోగొట్టుకోవడం వల్లనో కొత్త కార్డు తీసుకున్నప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. కొత్త కార్డు నంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ అన్నీ మారుతాయి. కానీ, మీరు వాడుతున్న వివిధ యాప్‌లు లేదా సేవలు అందించే మర్చంట్ల వద్ద పాత కార్డు వివరాలే భద్రపరచబడి ఉంటాయి. దీంతో తదుపరి బిల్లు చెల్లించే సమయానికి పేమెంట్స్ ఫెయిల్ అవుతాయి
ఆటో-డెబిట్ పేమెంట్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి?
మీ క్రెడిట్ కార్డులో తగినంత లిమిట్, బ్యాలెన్స్ అన్నీ పుష్కలంగా ఉండవచ్చు. అయినప్పటికీ పేమెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుందనే సందేహం చాలా మందికి కలుగుతుంది. ఇక్కడ సమస్య మీ ఖాతాలో కాదు, అవతలి మర్చంట్లు లేదా యాప్‌ల సిస్టమ్‌లో ఉన్న పాత కార్డు సమాచారంలోనే ఉంది. కార్డు మారినప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని చోట్లా కొత్త వివరాలు అప్డేట్ కావాలని లేదు. కొన్ని సందర్భాల్లో అకౌంట్ అప్డేటర్ సర్వీసులు పనిచేసినప్పటికీ, అన్ని సర్వీసులకు ఇది వర్తించదు. దీనివల్ల సబ్స్క్రిప్షన్లు రద్దవడం, సర్వీసులు నిలిచిపోవడం లేదా లేట్ ఫీజులు చెల్లించాల్సి రావడం జరుగుతుంది.

ఏయే సేవలకు ఈ సమస్య ఎదురుకావచ్చు?
మీ క్రెడిట్ కార్డుకు అనుసంధానించిన దాదాపు ప్రతి రకమైన ఆటో-డెబిట్ సేవకూ ఈ ముప్పు ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రింది వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలి:
- ఓటీటీ స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్లు (నెట్‌ఫ్లిక్స్ తదితర యాప్‌లు)
- మొబైల్, ఇంటర్నెట్, యుటిలిటీ బిల్లులు
- నెలవారీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు
- సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్లు, క్లౌడ్ స్టోరేజ్
- జిమ్ మెంబర్షిప్లన, ఇతర రెగ్యులర్ షాపింగ్ పేమెంట్లు
కొత్త కార్డు అందుకున్న తర్వాత ఏం చేయాలి?
కొత్త క్రెడిట్ కార్డు చేతికి రాగానే అప్రమత్తమవడం చాలా ముఖ్యం. ఏఏ సేవలకు మీ పాత కార్డు వివరాలు లింక్ అయి ఉన్నాయో ఒక చిన్న జాబితా తయారు చేసుకోండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ ఈఎంఐల వంటి అత్యవసర చెల్లింపులను ముందుగా కొత్త కార్డు వివరాలతో అప్డేట్ చేయండి. ఆ తర్వాత ఎంటర్మైన్మెంట్ విభాగానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్లను సరిచూసుకోండి. అలాగే, కొత్త కార్డు వచ్చిన మొదటి నెల స్టేట్మెంట్ను చాలా శ్రద్ధగా పరిశీలించాలి. సాధారణంగా ప్రతి నెలా జరిగే లావాదేవీ ఈసారి జరగకపోతే, ఆ సేవకు సంబంధించిన యాప్‌ను ఓపెన్ చేసి పేమెంట్ ఫెయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవడం మంచిది.
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టాన్ని తెస్తుంది
ఆటో-డెబిట్ ఫెయిల్ అయిందని చిన్న చిన్న సబ్స్క్రిప్షన్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తే పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. కానీ, ఇన్సూరెన్స్ ప్రీమియంలు లేదా అత్యవసర బిల్లుల విషయంలో ఈ పొరపాటు జరిగితే పాలసీ లాప్స్ అవ్వడం లేదా భారీ జరిమానాలు కట్టాల్సి రావడం జరుగుతుంది. అందుకే, కొత్త క్రెడిట్ కార్డు తీసుకున్న వెంటనే అన్ని ఆటో-డెబిట్ లింక్‌లను సరిచూసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ చిన్న జాగ్రత్తతో అనవసరమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు.














Click it and Unblock the Notifications
