Video: సడెన్‌గా బైక్ ఆపిన పోలీస్.. ఎవరూ గెస్ చేయలేని టాస్క్.. నిమిషాల్లోనే పూర్తి చేసిన బైకర్...
సాధారణంగా బైక్‌పై వెళ్తున్నప్పుడు ఎవరైనా పోలీస్ మిమ్మల్ని ఆపారనుకోండి... వెంటనే ఒకరకమైన టెన్షన్ మొదలవుతుంది... ఎందుకు ఆపారో... ఏం అడుగుతారో... ఇలా లోలోపల ఎన్నో ప్రశ్నలు వినిపిస్తుంటాయి. అయితే అన్నిసార్లు మనం టెన్షన్ పడేంత మ్యాటర్ అక్కడేమీ ఉండకపోవచ్చు. తాజాగా తమిళనాడులోని ఓ బైకర్‌కు ఇదే తరహాలో ఊహించని అనుభవం ఎదురైంది. బైక్‌పై రయ్యిమని దూసుకెళ్తున్న అతన్ని సడెన్‌గా ఓ పోలీస్ అధికారి ఆపాడు. ఎందుకు ఆపాడో... ఏం అడుగుతాడో అనుకున్నాడు... కానీ ఒక్కసారి ఆయనతో మాట్లాడాక.. అది టెన్షన్ పడాల్సిన విషయం కాదు... ఒక టాస్క్ అని అర్థమైంది. ఇంతకీ ఆ పోలీస్.. ఆ బైకర్‌కు ఇచ్చిన టాస్క్ ఏంటి...

అసలేం జరిగిందంటే...
అతనో ట్రావెలర్... బైక్‌పై సుదూర ప్రాంతాలకు ట్రావెల్ చేయడమంటే అతనికి చాలా ఇష్టం... యూట్యూబ్‌లో సొంత ఛానెల్ కూడా నడుపుతున్నాడు... ఇదే క్రమంలో ఇటీవల కర్ణాటక నుంచి తమిళనాడులోని టెన్‌కాశికి బైక్‌పై బయలుదేరాడు... మార్గమధ్యలో అనూహ్యంగా ఓ పోలీస్ అధికారి బైక్ ఆపమని సైగ చేశాడు... దాంతో బైక్ ఆపక తప్పలేదు. అయితే ఆ అధికారి అతన్ని తనిఖీ చేయడం కోసమో... లేక మరేవైనా వివరాలు అడగడం కోసమో ఆపలేదు. ఆ బైకర్‌కి అనుకోని టాస్క్ ఒకటిచ్చాడు...

ఇదీ టాస్క్...
అతను బైక్ ఆపిన వెంటనే... కర్ణాటక నుంచి వస్తున్నావా అని ఆ పోలీస్ అధికారి అడిగాడు.. అందుకు అతను అవునని చెప్పాడు. 'ఇంతకముందే ఇటువైపు నుంచి ఒక బస్సు ముందుకెళ్లింది... అందులో ఒక ప్రయాణికురాలి మందుల డబ్బా కింద పడిపోయింది.. నువ్వూ అదే దారిలో వెళ్తున్నావు కదా... బస్సును చేజ్ చేసి ఈ మెడిసిన్ ఆమెకు ఇవ్వు...' అని ఆ పోలీస్ అతనితో చెప్పాడు. ఊహించని ఈ టాస్క్‌ను అతనో ఛాలెంజ్‌లా తీసుకున్నాడు... వెంటనే రయ్యిమని బైక్‌ను పరుగులు పెట్టించాడు...
నిమిషాల్లోనే పూర్తి... నెటిజన్ల ప్రశంసలు...
నిమిషాల్లోనే ఆ బస్సును చేజ్ చేసి... బస్సు డ్రైవర్‌కు చేతితో సైగ చేశాడు. ఒకసారి బస్సును ఆపాలని కోరాడు. దీంతో బస్సు డ్రైవర్ రోడ్డుకు ఒక పక్కన బస్సు ఆపాడు. వెంటనే ఆ బైకర్ ఆ పోలీస్ అధికారి ఇచ్చిన మందుల సీసాను అందులోని ప్రయాణికురాలికి అందజేశాడు... అలా ఆ పోలీస్ ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ వీడియోను అతను తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. ఇప్పటివరకూ 17వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. ఆ పోలీస్ అధికారి,బైకర్‌ను అంతా అభినందిస్తున్నారు. మానవతాదృక్పథంతో వ్యవహరించారని కొనియాడుతున్నారు.