చంద్రబాబు కీలక ప్రకటన.. రాజంపేట లోక్ సభ అభ్యర్థిగా గంట నరహరి
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం ఉంది. అయినప్పటికీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పుడే ఎన్నికలు జరిగిన సిచుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. పార్టీలు, అధినేతల లెక్కలు ఇలానే ఉన్నాయి. ఆ మేరకు చేరికలు కూడా జరుగుతున్నాయి. ఏడాదిన్నర.. రెండేళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మినీ మహానాడుకు హాజరయ్యారు. పీలేరులో పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజంపేట లోక్ సభ స్థానం నుంచి గంటా నరహరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. గంటా నరహరి గత వారం చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరిన సంగతి తెలసిందే. రాజంపేటకే చెందిన గంటా నరహరి బెంగళూరు కేంద్రంగా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

2017-2018లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. గంటా నరహరి రాజకీయాలకు కొత్తే అయినా... ఆయన కుటుంబం మాత్రం చాలా కాలం రాజకీయాల్లో కొనసాగుతుంది. దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు భార్య దివంగత సత్యప్రభ సోదరి కుమార్తెను నరహరి పెళ్లి చేసుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యప్రభ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో మరణించారు. నరహరికి టీడీపీ ఆహ్వానం పలికింది. వచ్చే ఎన్నికల్లో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి తన అభ్యర్థిగా ప్రకటించింది.
వ్యాపారం ద్వారా నరహరి వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తటస్థులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే వారు, తటస్థులు తెలుగు దేశంలోకి రావాలని చంద్రబాబు ఇటీవల అన్నారు. వైసీపీ పాలనలో నాశనం అయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు కలిసి రావాలని అన్నారు.












Click it and Unblock the Notifications