మీ అమ్మను కన్న నాన్నను అడుగు: నారా లోకేష్‌ను ఏకి పారేసిన రోజా..!!
చిత్తూరు: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కుప్పం పర్యటన సందర్భంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జగన్ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందంటూ ఆయన చేసిన ఆరోపణలపై రోజా తనదైన శైలిలో విమర్శలు సంధించారు.

వార్డు మెంబర్‌గా కూడా..
ఓ వీడియోను రోజా విడుదల చేశారు. నారా లోకేష్ కుప్పం వెళ్లి లేని గొప్పలు చెప్పుకొంటోన్నాడని ధ్వజమెత్తారు. లోకేష్‌ను చూస్తోంటే ఉత్తర కుమారుడు గుర్తుకొస్తోన్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ ప్రచారం చేసిన తరువాతే కుప్పం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని నారా లోకేష్- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలిగోటికి కూడా లోకేష్ సరిపోడని చురకలు అంటించారు.

ఓడిపోతాననే భయంతోనే..
రికార్డు స్థాయిలో మెజారిటీతో వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలిచారని, మంగళగిరిలో పోటీ చేసి మరీ నారా లోకేష్ ఓడిపోయాడని రోజా అన్నారు. చంద్రబాబు మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే.. కనీసం వెయ్యి మంది కూడా ఆయన వెంట లేరని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో ప్రజల మధ్య గొడవలు సృష్టించాడని, ఓడిపోతాననే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
ఏదో ఇరగదీద్దామని..
మొదటు చంద్రబాబు, ఇప్పుడు నారా లోకేష్.. కుప్పంలో ఏదో ఇరగదీద్దామని వచ్చినట్లు కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. కుప్పంలో లోకేష్ ప్రచారం చేయడం వల్లే మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చాడంటూ నిలదీశారు. 33 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కుప్పానికి ఏం చేశారో చెప్పుకోలేకపోతున్నారని, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి భరించలేకపోతున్నారని రోజా విమర్శించారు.

మీ అమ్మను కన్న నాన్నను అడుగు..
కుప్పంలో టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎంపీపీ అశ్విని మీద ఎలా దాడి చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని రోజా చెప్పారు. దాడులకు పాల్పడినవారిపై కేసులు పెట్టకుండా సన్మానించమంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాంటి వాడో మీ అమ్మను కన్న నాన్న (ఎన్టీఆర్)ను అడుగు చెబుతాడని రోజా అన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసి, అడ్డదారిలో ముఖ్యమంత్రి అయింది చంద్రబాబేనని ప్రజలందరికీ తెలుసని చెప్పారు.
Recommended Video

కుప్పం బ్రాంచ్ కెనాల్..
కుప్పానికి బ్రాంచ్ కెనాల్‌ను ఎందుకు తీసుకుని రాలేదంటూ నారా లోకేష్ ప్రశ్నించడంలో అర్థం లేదని రోజా అన్నారు. ముందుగా ఈ ప్రశ్నను అడగాల్సింది చంద్రబాబుకేనని చెప్పారు. 33 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కుప్పానికి బ్రాంచ్ కెనాల్ ఎందుకు తీసుకుని రాలేదో చెప్పగలవా? అని నిలదీశారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రిపదవులు ఇచ్చిన చంద్రబాబును ప్రజాస్వామ్యం గురించి అడగాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications