కట్టెలు కొట్టి, కూరగాయాలు విక్రయించి.. అటెండర్ కోడలు.. ఇదీ మేయర్ల గాధ
సాధారణ మహిళ. తల్లిదండ్రులు లేరు. రోజంతా కష్టపడితే నాలుగు మెతుకులు దొరికేది. కుటుంబం గడవడం కోసం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మాల్సిందే. కట్టెలు కొట్టిన ఆమె.. నేడు మేయర్ అయ్యింది. చిత్తూరు కార్పొరేషన్ నూతన మేయర్‌గా అముద ఎన్నికయ్యారు. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికయ్యారు.

కట్టేలు అమ్మితే రూ.20
తమది పేద కుటుంబం అని.. అమ్మనాన్న చనిపోయేనాటికి ఊహ కూడా తెలియదన్నారు. అక్కతోపాటు పనికిపోయేదానినని తెలిపారు. ఆమె కష్టం చూసి.. అడివికెళ్లి కట్టెలు కొట్టేదాన్ని వివరించారు. వాటిని తీసుకొచ్చి కాలనీలో అమ్మితే రూ.20 వచ్చేవని గుర్తుచేశారు. తనెవరో కూడా జనానికి తెలియదన్నారు. జగనన్నను చూసి ఓట్లేసి గెలిపించారని.. ఇప్పుడు మేయర్‌గా చేశారని తెలిపారు.

కూరగాయాల వ్యాపారి
కడప జిల్లాలో కూరగాయల వ్యాపారి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. స్థానిక నాయకుల నుంచి ఒత్తిళ్లు ఉన్నా అవేవీ పట్టించుకోకుండా.. ప్రజాదరణ కలిగిన కూరగాయల వ్యాపారిని మున్సిపల్ చైర్మన్‌గా చేశారు. రాయచోటికి చెందిన షేక్ బాషా డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలో కూరగాయలు అమ్ముతూ జీవిస్తున్నారు. స్థానికంగా మంచి పేరున్న షేక్ బాషాకు వైఎస్సార్ సీపీ మున్సిపాలిటీ ఎన్నికలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ బాషాను గెలిపించారు. రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్‌గా బాషా ఎన్నికయ్యారు.

అటెండర్ కోడలు మేయర్
ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్‌గా మునేయ్య పనిచేశారు. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ముప్పై ఏళ్లు సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో అటెండర్‌గా ఆరేళ్లక్రితం రిటైరయ్యారు. కోడలు మేయరుగా ఎంపిక కావడంపై మునెయ్య, కుటుంబీకులు ఆనందంలో మునిగిపోయారు.

ఇద్దరు కుమారులు
మునెయ్యకు ఇద్దరు కుమారులు. వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రి అధినేత డాక్టర్ మునిశేఖర్ పెద్దకుమారుడు. ఈయన భార్యే డాక్టర్ శిరీష. చిన్న కుమారుడు తులసీయాదవ్ టౌన్‌బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. కడప జిల్లా కొర్రపాడుకు చెందిన శిరీష 1980లో జన్మించారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి 2011లో డీజీవో పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం తిరుపతిలోని ఆశాలత టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. మునిశేఖర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనతోపాటు వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు.

చిరు వ్యాపారి..
తోపుడు బండిపై బొప్పాయి, మామిడి, కర్బూజ తదితర పండ్లు విక్రయించే ఓ చిరు వ్యాపారిని మునిసిపల్ చైర్మన్ పీఠం వరించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఇంటర్ చదివిన రాజ్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. వైఎస్సార్‌సీపీ టికెట్ రాజ్‌కుమార్‌కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో ఇంటింటికీ తిరుగుతూ పేదోడిని ఆదరించాలంటూ ఓటర్లను వేడుకున్నారు.












Click it and Unblock the Notifications