వారికి నా సత్తా చూపిస్తా: సొంత పార్టీ నేతలకూ రోజా వార్నింగ్: మంత్రి హోదాలో నగరికి
చిత్తూరు: పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తొలిసారిగా రోజా.. తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని నగరికి వచ్చారు. తమిళనాడులోని అరుణాచలం, కంచి ఆలయాలను దర్శించుకున్న అనంతరం రోజా- నగరిలో అడుగు పెట్టారు. భారీ కాన్వాయ్‌తో తన బలాన్ని నిరూపించకునే ప్రయత్నం చేశారు. తమిళనాడు సరిహద్దుల నుంచి కాన్వాయ్ మొదలైంది. పదుల సంఖ్యలో కార్లు, బైక్‌ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్.. రోజాకు ఘన స్వాగతం పలికింది.
నగరికి చేరుకున్న అనంతరం క్లాక్ టవర్ వద్ద స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయ ప్రత్యర్థులను సైతం సున్నితంగా హెచ్చరించారు. ఇప్పటి వరకు ఒక లెక్క..ఇకపై మరో లెక్క ఉంటుందని స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.

తల్లిదండ్రులు తనకు జన్మను ఇస్తే.. నగరి ప్రజలు రాజకీయ జన్మను ఇచ్చారని మంత్రి రోజా అన్నారు. రెండుసార్లు నగరి ఓటర్లు తనను గెలిపించడం వల్లే మంత్రి పదవి వరించిందని చెప్పారు. నగరిలో తన పని అయిపోయిందంటూ ప్రచారం చేసిన వారి నోళ్లు మూయించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు మంత్రి పదవిలో కూర్చోబెట్టారని అన్నారు. మంత్రి పదవి రాదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా దక్కదనే ప్రచారం సాగించిన వారి నోళ్లు మూతపడ్డాయని చెప్పారు.
నగరి ప్రజల ఆదరణ వల్లే తాను మంత్రి కాగలిగానని రోజా అన్నారు. తన రాజకీయాలు ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్కగా ఉంటాయని వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థులకు తన సత్తా ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. తన పని అయిపోయిందంటూ ప్రత్యర్థులు వ్యాఖ్యానించిన ప్రతీసారీ.. ప్రజలు తనను ఆదరించారని గుర్తు చేశారు. ఆ గుర్తింపు వల్లే మంత్రి పదవి వచ్చిందని చెప్పారు. నగరి నియోజకవర్గాన్ని వైసీపీ కంచుకోటగా రోజా అభివర్ణించారు.

తనను రెండుసార్లు గెలిపించి, మంత్రి పదవి రావడానికి కారణమైన నగరి నియోజకవర్గం ప్రజలకు ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తానని రోజా అన్నారు. 2024లోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని, వార్ వన్‌సైడ్ అవుతుందని తేల్చి చెప్పారు. జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతానని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఆదరణకు నోచుకోని ఎన్నో పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయని, వాటన్నింటిని కనెక్ట్ చేసేలా సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications