వైసీపీ ఎమ్మెల్యేపై వల?: సోదరుడి ఇంటిపై ఐటీ దాడులతో కలకలం..!!
అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన గుంటూరు శాసన సభ్యుడు ముస్తఫా సోదరుడి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ ఉదంతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
గుంటూరు: కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్నుశాఖ అధికారుల దాడులు తీవ్రతరమౌతోన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సైతం అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు. హైదరాబాద్ లోనూ పెద్ద ఎత్తున ఐటీ సోదాలు కొనసాగాయి. రియల్ ఎస్టేట్స్ కంపెనీ కార్యాలయాల మీద దాడులు జరిగాయి.
అదే సమయంలో ఏపీలోనూ ఐటీ అధికారుల దాడులు చోటు చేసుకోవడం కలకలం రేపింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు శాసన సభ్యుడు ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈ దాడులు జరిగాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ముస్తఫా సోదరుడుకనుమ.. అంజుమన్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ముస్తఫాకు చెందిన కొన్ని వ్యాపార లావాదేవీలను కూడా ఆయనే పర్యవేక్షిస్తోన్నారు. ఈ దాడుల సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.
ఇవ్వాళ రెండు బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు కనుమ నివాసం, కార్యాలయాల్లో ఉదయం నుంచీ సోదాలు ముస్తాఫా కుటుంబ సభ్యులకు పొగాకు వ్యాపారాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాకముందే ముస్తఫా పొగాకు వ్యాపారంలో స్థిరపడ్డారు. ఎమ్మెల్యేగా ముస్తాఫా తీరిక లేకుండా గడుపుతోండటం వల్ల ఈ వ్యాపార లావాదేవీలన్నింటినీ కనుమ చూసుకుంటోన్నారు.
ముస్తఫా.. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఈ సారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. తన కుమార్తెకు టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తన కుమార్తె పోటీ చేస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications