వంగలపూడి అనిత..నారీ సంకల్ప దీక్ష: వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు
గుంటూరు: మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. నారీ సంకల్ప దీక్షను ప్రారంభించారు. గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ దీక్ష శిబిరం ఏర్పాటైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే కారణంతో ఆమె ఈ దీక్షను నిర్వహిస్తోన్నారు.

నారీ సంకల్ప దీక్ష..
ఈ దీక్షా శిబిరానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు హాజరయ్యారు. ఆమెకు సంఘీభావంగా దీక్ష శిబిరంలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. దిశా చట్టం అమలును ప్రశ్నించారు. దిశా నువ్వెక్కడ అని రాసివున్న ప్లకార్డులు, ఇదివరకు రాష్ట్రంలో చోటు చేసుకున్న నేరాలకు సంబంధించిన ఫొటోలు, వాటి కథనాలను ముద్రించిన ప్లకార్డులను ప్రదర్శించారు.

జగన్ పాలనకు చరమగీతం..
ఈ ఉదయం పార్టీ కేంద్రకార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందే అక్కడ సిద్ధం చేసిన శిబిరంలో కూర్చున్నారు. అంతకుముందు- తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. తెలుగుదేశం మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు అనితకు తలపాగా చుట్టారు. అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. మహిళా ద్రోహి జగన్ పాలనకు చరమగీతం పలకాలంటూ నినదించారు.

అరాచకాలు అంతులేదా?
అనంతరం కొద్దిసేపు ప్రసంగించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా మహిళలపై అరాచకాలు ప్రబలి పోయాయని, వాటికి అంతులేకుండా పోయాయని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని.. గృహిణులకు పెను భారాన్ని మిగుల్చుతున్నాయని విమర్శించారు. మద్యపాన నిషేధంపై ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ ఇప్పుడు మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. మహిళా సాధికార సంఘాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు.

దిశ చట్టం ఏమైంది?
దిశ చట్టాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ.. పోలీసులు స్పందించట్లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్య వైఖరి, పోలీసు యంత్రాంగం వైఫల్యాలను నిరసిస్తూ ఈ దీక్షను చేపడుతున్నట్లు వంగలపూడి అనిత పేర్కొన్నారు. మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ఆమె విమర్శించారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
నిరంతర పోరాటం..
మహిళల భద్రత, వారి భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటాన్ని సాగిస్తుందని వంగలపూడి అనిత అన్నారు. పట్టపగలు కూడా మహిళలు రోడ్డుపై నడవలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో నిత్యం మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏనాడు కూడా ముఖ్యమంత్రి నిందితులపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని ఆరోపించారు.
అన్ని వేళలా అందుబాటులో ఉంటాం..
తెలుగుదేశం పార్టీ మహిళలు, బాలికలకు అండగా ఉంటుందని వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. మహిళల్లో ధైర్యం నింపడానికే సంకల్ప దీక్ష చేపట్టినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, ఎలాంటి ఆపద వచ్చినా తాము ముందుంటామని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికే నారీ సంకల్ప దీక్షను చేపట్టామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications